నగరంలో అత్యంత కీలకమైన ఎన్ఏడీ కూడలిలో ఫ్లై ఓవర్ నిర్మాణ ప్రాజెక్టు ఎపట్టాలపై కెక్కింది. సుమారు రూ. 113 కోట్ల వ్యయంతో దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఈ ఎన్ఏడీ ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేయ్యనున్నారు.
జూలై 7న ఈపీసీ విధానంలో టెండర్లను ఆహ్వానించగా, విజయ్ నిర్మాణ్ కంపెనీ లిమిటెడ్, ఎం.వెంకట్రావ్ ఇన్ఫ్రా ప్రాజెక్టు సంస్థలు టెండర్లు వేశాయి. వీటని వుడా అధికారులు ఎవాల్యుయేషన్ చేసి విజయ్ నిర్మాణ్ కంపెనీకి టెండర్లు ఖరారు చేశారు.
దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. కింది నుంచి చిన్న వాహనాలు.. పై నుంచి భారీ వాహనాలు.. నాలుగు వైపుల నుంచి పాదచారులు వెళ్ళేలా నిర్మిస్తారు. మెట్రో రైలు నిర్మాణానికి అనువుగా ఈ వంతెన నిర్మాణం సాగునుంది. రెండేళ్ళ గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాల్సి ఉంది.
అత్యంత రద్దీ కూడలి
ఎన్ఏడీ జంక్షన్ విశాఖ నగర కూడళ్లలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. నగరం నుంచి గోపాలపట్నం, సింహాచలం, పెందుర్తి, అరకు వెళ్లేందుకు ఈ జంక్షనే ప్రధాన మార్గం. నగర శివారు ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇదే కీలకమైన కూడలి. చెన్నై, విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు ఈ రహదారే ముఖ్యమైన మార్గం.
రవాణా శాఖ అంచనాల ప్రకారం ఈ జంక్షన్ ను గంటకు 3,500 మంది పాదచారులు దాటుతున్నారు. వాహనాల సంఖ్య దాదాపు 50 వేల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాంటి జంక్షన్లో ఫ్లై ఓవర్ నిర్మిస్తే నగరానికి సంబంధించిన ట్రాఫిక్ను దాదాపు తగ్గించవచ్చని అధికారులు అంచనా. అందుకే ఈ ఫైఓవర్ నిర్మాణం ప్రతిష్టాత్మకంగా మారింది.