ప్రజా పోరాట యాత్ర పేరుతో జనసేన పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళుతూనే మరోపక్క ఎన్నిక లకు ఎవరిని బరిలోకి దింగాలనే అంశాలపైన పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించినా ఇంకా దీని పై కచ్చితమైన క్లారిటీ ఇంత వరకూ ఇవ్వలేదు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ సీటుకు ఎవరిని బరిలోకి దింపాలనే అంశం పై ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నట్లు సమాచారం. కాకినాడ నుండి పవన్ సోదరుడు నాగబాబును పోటీలోకి దించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. త్వరలోనే నాగబాబు జనసేన ద్వారా రాజకీయ రంగంలోకి అడుగిడుతారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది.
ప్రజా రాజ్యం తరపున సాధ్యంకానిది ఇప్పుడు జనసేనతోనైనా సాధించాలనే పట్టుదలతో నాగబాబు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే నాగబాబు అన్న మెగాస్టార్ చిరంజీవికి, ఇటు పవన్ కు అండగా ఉంటూ వస్తున్నారు. ప్రజారాజ్యం తరపున ఆయన గతంలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని చిరంజీవికి అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆయన కాకినాడలో పోటీచేస్తారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. అయితే ఆప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ పోటీ చేయడంతో నాగబాబు పోటీ నుండి విరమించుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి ఈసారి ఎలాగైనా రాజకీయాల్లోకి రావాలని నాగబాబు భావిస్తున్నారు.
తాను ఎంపీగా పోటీ చేస్తానని, తనకు కాకినాడ సీటు ఇవ్వాలని నాగబాబు చాలా కాలం క్రితమే పవన్ ను కోరినట్లు సమాచారం. కాగా ఇందుకు పవన్ కూడా అంగీకరించినట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాకినాడ నుండి పోటీ చేస్తే తన గెలుపు సులువు అవుతుందని నాగబాబు అంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు త్వరలో వివిధ సంఘాల నాయకులు, చిరంజీవి ఫ్యామిలీ అభిమానులతో సమావేశం కాబోతున్నారనే వార్తలు కూడా ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కు చిరంజీవి ఫ్యామిలీ అండ ఉంటుందని గతంలోనే మెగా హీరోలందరూ స్పష్టం చేశారు. పార్టీ ఒంటరిగా లేక ఇతర పార్టీలతో ఒక అంగీకారానికి వచ్చినా మెగా అభిమానులు పవన్ కల్యాణ్ కు బాసటగా నిలుస్తున్నారు.
జనసేన పార్టీ పోటీచేస్తే ఎక్కువ సీట్లు సాధించే జిల్లాల్లో తూర్పు, పశ్చిమగోదావరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా మరిన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ అంచనా వేస్తున్నారు. అందులోనూ మెగా కటుంబానికి చెందిన వారైతే గెలుపు మరింత సులువు అవుతుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది. కాగా పవన్ కల్యాణ్ ప్రభావం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా ఉండనుందని రాజకీయ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ప్రజారాజ్యం కూడా ఇదే జిల్లాల్లో బలమైన ప్రభావం చూపింది. ఇక ఇప్పుడు జనసేన ప్రభావం కూడా ఇక్కడే ఉంటుందన్న నేవథ్యంలో పవన్ కల్యాణ్ ప్రధానంగా ఈ జిల్లాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు, అనంతపురం, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సైతం అధిక స్థానాలను కైవసం చేసుకునేలా జనసేన వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.