ఏపీలో గత నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో వైసీపీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తే, టీడీపీ ఓటమిని మూటగట్టుకుంది. అయితే ఇక మూడో ప్రధాన పార్టీ జనసేన పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. పార్టీ అధినేత పవన్ కళ్యాణే పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. జనసేన కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అయితే టీడీపీ ఇలా ఓటమిపాలవ్వడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మితిమీరిన విధంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని కొన్ని విమర్శలు, మరీ శ్రుతిమించే విధంగా కూడా ఉన్నాయి. అయినా చంద్రబాబు అన్నీ భరిస్తూ, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
అయితే, ఈ విషయం పై జనసేన పార్టీ నాయకుడు నాగబాబు స్పందించారు. పదవిని కోల్పోయిన చంద్రబాబు, ఇప్పుడు నిరాయుధుడని, ఆయన్ను వదిలేయాలే తప్ప విమర్శిస్తే అది శాడిజం అనిపించుకుంటుందని నటుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయనో ట్వీట్ పెట్టారు. "చంద్రబాబు మన మాజీ సీఎం. ఇప్పుడు ఓడిపోయినంత మాత్రాన ఆయనను దారుణంగా విమర్శించటం తప్పు. మనిషి పవర్ లో ఉండగా విమర్శించటం వేరు. ఓడిపోయాక విమర్శించటం చేతకానితనం. ప్రత్యర్థి నిరాయుధుడు అయ్యి నిలబడితే వదిలెయ్యాలి. అంతే కాని అవకాశం దొరికింది కదా అని ట్రోల్ చెయ్యటం ఒక శాడిజం" అని ఆయన అన్నారు. అయితే మొన్నటి దాక, చంద్రబాబు పై, తెలుగుదేశం పై దారుణంగా ట్రోల్ చేస్తూ నాగబాబు సోషల్ మీడియాలో చేసిన హంగామా గుర్తు తెచ్చుకుంటూ, ఇలా ప్లేట్ మార్చేసారు ఏంటి అంటున్నారు ఆయన ఫాన్స్...