ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిదిన్నరేళ్ల క్రితం సంచలనం సృష్టించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్ న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్, వెంకటరావుగౌడ్‌లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. హత్య, అపహరణ నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. న్యాయస్థానం తీర్పు పట్ల నాగవైష్ణవి బంధువులు, విద్యార్థి, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తీర్పు కోసం ఏకంగా ఎనిమిదిన్నరేళ్లు పట్టడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాడిన నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి గతేడాది మృతిచెందారని.. ఆమె బతికుండగానే తీర్పు వస్తే ఆ కుటుంబానికి స్వాంతన కలిగేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో 2010లో జరిగిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లే.. బీసీ సంఘం నేత, మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్ తన అక్క కూతురు వెంకటరామమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి దుర్గాప్రసాద్ అనే కుమారుడు జన్మించిన తర్వాత, నిజామాబాద్ జిల్లాకు చెందిన నర్మదను ప్రభాకర్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి సాయితేజేష్, నాగవైష్ణవి ఇద్దరు సంతానం కలిగారు. వైష్ణవి పుట్టిన తర్వాత ప్రభాకర్ దశ తిరిగింది. కుమార్తె పేరుతో ఆస్తులు కూడబెడుతున్నాడని మొదటి భార్య వెంకటరామమ్మ సోదరుడు వెంకటరావు బలంగా నమ్మాడు.
దీంతో వైష్ణవిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా చిన్నమ్మ కుమారుడు శ్రీనివాసరావుతో కోటి రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జనవరి 30న వైష్ణవిని కిడ్నాప్ చేసి చంపేశారు. తర్వాత ఆమె మృతదేహాన్ని ఇనుమును కరిగించే బాయిలర్‌లో వేసి బూడిద చేశారు. వైష్ణవి మరణవార్తతో కలత చెందిన ప్రభాకర్ తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. ఆ తర్వాత కారు డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ఆరేళ్లు గడిచిపోయినా కేసు విచారణ ఇంకా సాగడంతో నర్మదాదేవి మరింత కుంగిపోయింది. దీనికి తోడు బ్రెయిన్ క్యాన్సర్ కూడా రావడంతో యేడాదిన్నర క్రితం మరణించారు. కుటుంబంలో తల్లి, తండ్రి, చెల్లెలిని కోల్పోయిన ఇద్దరు అబ్బాయిలు మిగిలిపోయారు. వారు కూడా ఈషాక్ నుంచి ఇంకా తేరుకోలేక పోతున్నారు.