ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నా, ప్రతి రోజు ఎక్కడో ఒక చోట, దేవాలయాల పై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఆకతాయలు చేస్తున్నారో, లేక ఏదైనా అజెండా పెట్టుకుని ఎవరైనా చేస్తున్నారో కాని, ఈ చర్యలతో హిందువుల మనోభావాలు మాత్రం దెబ్బ తింటున్నాయి. గత నెల రోజులుగా ఈ దాడులు మరీ ఎక్కువ అయిపోయాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుని, ఈ దాడుల చేస్తున్న వారిని శిక్షిస్తే కానీ, ఇవి ఆగేలా లేవు. అలాగే ప్రభుత్వం కూడా, ఈ దాడులు పై సమీక్ష చేసి, తగు చర్యలు తీసుకుని, పోలీసులకు తగు సూచనలు ఇచ్చి, ఈ దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు కాలిపోయిన అంతర్వేది రధం స్థానంలో నూతన రధం ఏర్పాటు అవుతుందని, అందరూ సంతోషిస్తున్న సమయంలో, ఈ రోజు కూడా మరో దాడి దేవాలయాల పై జరగటం దౌర్భాగ్యం. చిత్తూరు జిల్లా, గంగధర నెల్లూరులో, ఉపముఖ్యమంత్రి నారాయాణస్వామి నియోజకవర్గంలో, ఈ రోజు మరో సంఘటన జరిగింది.
గంగధర నెల్లూరు నియోజకవర్గంలోని, ఆగరమంగలం ఆలయంలో, నంది విగ్రహాన్ని, గుర్తు తెలియని వ్యక్తలు ధ్వంసం చేసారు. నంది విగ్రహాన్ని పెకలించి, విగ్రహాన్ని రెండు భాగాలుగా చేసారు. సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులకు సమాచారం ఇవ్వటంతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ ఘటన పై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇది ఆకతాయల పనా ? లేక రాజకీయ అజెండాతో చేసారా ? మరే కారణాలు అయినా ఉన్నాయా అనే విషయం పై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. త్వరలోనే ఈ ఘటన చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మరో పక్క ప్రతిపక్షాలు ఈ విషయం పై ఆందోళన వ్యక్తం చేసాయి. ప్రతి రోజు ఏదో ఒక ఘటన జరుగుతున్నా, ప్రభుత్వం నిలువరించలేక పోతుందని, దీని పై వెంటనే ఒక ఆక్షన్ ప్లాన్ విడుదల చేసి, వీటిని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/XyuGDJnyR7A