ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ఎన్ నరసింహన్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పారు. ఇప్పటివరకు దేశంలో ఏ గవర్నరూ పనిచేయనంతకాలం ఆయన గవర్నర్ పదవిలో కొనసాగి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు అత్యధికంగా సూర్జిత్‌సింగ్ బర్నాలా 11ఏళ్లపాటు గవర్నర్‌గా పనిచేయగా, దానిని నరసింహన్ సునాయసంగా అధిగమించారు. తొలుత 2007 జనవరి 25న చత్తీస్ఘడ్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన నరసింహన్ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఏకధాటిగా 12 సంవత్సరాల 4 నెలలుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా నరసింహన్ మాత్రం స్థానభ్రంశం లేకుండా దాదాపు రెండు దశాబ్దాల కాలం స్థిరంగా ఒకేచోట తన పదవీకాలాన్ని కొనసాగిస్తూ దేశంలో రెండో గవర్నర్‌గా మరో రికార్డు నమోదు చేశారు.
గతంలో మహిళా గవర్నర్‌గా సరోజినీనాయుడు కుమార్తె పద్మజా నాయుడు పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా 1956 నవంబరు 3వ తేదీ నుంచి 1967 జూన్ 1వ తేదీ వరకు దాదాపు 10 సంవత్సరాల 209 రోజులపాటు ఏకధాటిగా పనిచేశారు. ఆ తర్వాత స్థానంలో ఎక్కువకాలం ఒకే రాష్ట్రానికి పనిచేసిన గవర్నర్‌గా నరసింహన్ ద్వితీయస్థానంలో ఉండటం గమనార్హం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ (ఇ.ఎస్.ఎల్.నరసింహన్) 1946లో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రంలో, న్యాయ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1968లో భారత పోలీస్ సేవలో చేరి ఆంధ్రప్రదేశ్ విభాగానికి మారారు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధానాధికారిగా పనిచేసి 2006లో ఉద్యోగ విరమణ చేశారు. రష్యా రాయబారిగా కొంతకాలం పనిచేశారు. తదుపరి చత్తీస్ఘడ్ రాష్ట్రానికి మూడవ గవర్నర్‌గా 2007 జనవరి 25న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేస్తూనే 2009 జనవరి 28వ తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22వ గవర్నరగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత సుమారు నెల రోజులకే ఏపీ గవర్నర్‌గా పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా రెండింటికీ ఆయనే గవర్నర్‌గా కొనసాగుతున్నారు.
యూపీఏ ప్రభు త్వంలో నియమితులైన నరసింహన్ 2014లో ఎన్టీఏ అధికారంలోకి వచ్చి నప్పటికీ రాజకీయనేతలకు మించి చాణుక్యాన్ని ప్రదర్శిస్తూ తన హవాను కొనసాగిస్తున్నారు. 2009 నుంచి 2014వరకు ముగ్గురు ముఖ్య మంత్రులు మారారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కొణిజేటి రోశయ్య, తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రు లుగా వ్యవహరించారు. వారి ముగ్గురితోనూ నరసింహన్ సన్నిహితంగా మెలిగారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులతో ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్‌తోనూ ఆయన సన్నిహిత సంబంధాలు కల్గి ఉన్నారు. ఏ ఒక్క కీలక సమస్యను ఆయన పరిష్కరించలేదని, ఆయన పదవిని కాపాడు కోవడానికే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలోనూ, రాష్ట్ర విభజన సందర్భం లోనూ ఆయన పాత్ర కీలకమైనప్పటికీ వివాదస్పద అంశాలకు దూరంగా ఉండి చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చారన్న విమర్శ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నప్పటికీ ఏ ఒక్క సమస్యను పరిష్కరిం చేందుకు చొరవ చూపకుండా తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శను ఆయన ఎదుర్కొంటున్నారు.