ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మునిసిపల్ ఎన్నికలు తరువాత, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న సమయంలో, ఒక్కసారిగా అమరావతి భూములు స్కాం అంటూ ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సిఐడి, ఆయన్ను విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఈ వ్యవహారం పై కోర్టుకు వెళ్ళే నిర్ణయం పై, న్యాయనిపుణులు ఆలోచిస్తున్న సమయంలో, ఈ రోజు మాజీ మంత్రి నారాయణకు షాక్ ఇచ్చారు ఏసీబీ అధికారులు. మాజీ మంత్రి నారాయణకు చెందిన పది ప్రాంతాల్లో ఏకకాలంలో సీఐడీ దాడులు చేస్తుంది. ప్రధానంగా రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించి, కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలోనే, నిన్న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సిఐడి, ఈ రోజు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ చేయటం జరిగింది. అయితే మాజీ మంత్రి నారాయణ అందుబాటులో లేకపోవటంతో, ఆయన భార్య రమా దేవికి నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖున ఉదయం 11 గంటలకు, విజయవాడలో ఉన్న ఏపి సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని, ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే, అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ, ఆ నోటీసులో పేర్కొన్నారు.
అయితే నోటీసులు ఇచ్చిన సిఐడి, హైదరాబాద్ లోని ఆయన ఆస్తులతో పాటుగా, నెల్లూరు, విజయవాడలోని ఆయనకు సంబందించిన ఆస్తులు పై కూడా సోదాలు చేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థలకు సంబందించిన రికార్డులు అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే నారాయణకు దగ్గరగా ఉన్నటు వంటి వ్యక్తులకు, రాజధానిలో భూములు కేటాయించారని అనుమానిస్తున్న సిఐడి, దానికి సంబంధించి ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అనే విషయం పై కూడా సోదాలు చేస్తున్నాటు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటుగా, నెల్లూరు, విజయవాడలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విషయం పై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సిఐడి, ఆయన్ను 23న విచారణకు హాజరు కావాలని చెప్పగా, నారాయణకు 22వ తేదీన రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు పై, ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన తెలుగుదేశం పార్టీ, రేపు హైకోర్టులో పిటీషన్ వేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.