‘‘ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడు చేస్తున్న పోరాటం రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచీ చేసుంటే హోదా వచ్చేది’’ అని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తెలిపారు. హోదా ఇచ్చేవారికే ఏపీ ప్రజలు ఓట్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీకి మొదటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉందని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నేతలు ఏమైపోయారని ప్రశ్నించారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఆర్. నారాయణమూర్తి దుయ్యబట్టారు.
ప్రత్యేక హోదాపై విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన జీపు జాత శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలికి చేరుకుంది. నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ, ‘‘దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని చేస్తూ కేంద్రంపై పోరాడుతున్నారు. ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై కేసులు కొట్టివేయాలి. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరిన వెంకయ్యనాయుడు నోరు మూయించేందుకే మోదీ రాజ్యాంగబద్ద ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. వెంకయ్య పదవిని త్యజించి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలి. పార్టీలు జెండాలు పక్కనపెట్టి హోదా పోరాటంలో దిగాలి. ఇందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
‘‘ప్రత్యేక హోదా ఉద్యమానికి సీఎం చంద్రబాబు నాయకత్వం వహించాలి. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై గట్టిగానే పోరాడుతున్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప దేశానికి కాదు. ఆంధ్రా ప్రేక్షకుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న హీరోలు రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరిస్తున్నారు. శివాజీ, సంపూర్ణేష్‌బాబు తప్ప మిగతావారు స్పందించకపోవడం దారుణం. వారంతా చరిత్రహీనులుగా నిలిచిపోతారు’’ అని ఏపీ ప్రత్యేక హోదా సాధన కమిటీ చైర్మన్ చలసాని శ్రీనివాస్ అన్నారు.