సొంత పార్టీ నేతల పై డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా నాలాగా ఇబ్బందులు పడటం లేదని, ఆవేదన వ్యక్తం చేసారు. ఇన్ని ఒత్తిడులు తట్టుకోలేకపోతున్నానని, రాజకీయాలు నుంచి తప్పుకోమంటారా చెప్పండి అంటూ సొంత పార్టీ నేతల పైనే కె.నారాయణస్వామి ఫైర్ అయ్యారు. అయితే మంత్రి ఆవేదనకు సొంత పార్టీ నేతల వైఖరే కారణం అని తెలుస్తుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా అంటే రాజకీయంగా మాహామహులు ఉన్న జిల్లా. ముఖ్యంగా జగన్ బాంధవు, మంత్రి పెద్దిరెడ్డి హావా మాములుగా ఉండదు అక్కడ. ఆయన ఏమి చెప్తే అదే వేదం అనే విధంగా చిత్తూరు జిల్లా ఉంటుంది. అయితే ఇవి పక్కన పెడితే, మిగతా అధికార పార్టీ నాయకులు, కొంత ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అదే విషయాన్ని కె.నారాయణస్వామి కూడా చెప్పారు. చిత్తూరు జిల్లాల్లో ఉన్న గ్రూప్ రాజకీయాల వాళ్ళ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. సొంత పార్టీ నేతల ముందే ఈ విషయం చెప్పటం గమనార్హం. ప్రతిపక్ష నేతల పై ఒత్తిడి తీసుకురావటంలో కె.నారాయణస్వామి ఫెయిల్ అయ్యారు అంటూ, కొంత మంది వైసిపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, డిప్యూటీ సియం కె.నారాయణస్వామి ఆవేదనకు గురి అవ్వటానికి కారణం అయ్యాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు తరతరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. పక్కనే ఉన్న తమిళనాడు ప్రభావం, చిత్తూరు జిల్లా పై గట్టిగానే ఉంటుంది. తరతరాలుగా చేస్తున్న ఈ జల్లికట్టుకు ఈ సారి అనుమతి లేదని ప్రభుత్వం చెప్పటంతో, స్థానిక వైసీపీ నేతలు, ఆ ఆగ్రహాన్ని డిప్యూటీ సియం మీద చూపించారు. అధికారంలో ఉండి కూడా పండుగ నిర్వహించుకోలేక పొతే కష్టం అని, వాపోయారు. అయితే ఈ సందర్భంలో కలుగ చేసుకున్న కె.నారాయణస్వామి, అందరిలా నేను ఉండలేనని అన్నారు. ఈ విషయం పై పోలీసులతో, ఎస్పీతో మాట్లాడానని, ఇప్పటికే ఇక్కడ చుట్టు పక్కలా, తమిళనాడులో జల్లికట్టు జరుగుతున్న విషయం చెప్పినా, అటు వైపు నుంచి స్పందన రాలేదని, ఇంకా ఏమి చేయాలనీ ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాదు, కొంత మంది ప్రతిపక్ష నాయకులను ఊరి నుండి తరిమేయాలని అంటున్నారని, ఇది ఎలా సాధ్యం అని, ఏమైనా చట్టాలు ఉన్నాయా అని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే మంత్రి బహిరంగంగా ఇలా ఆవేదన వ్యక్తం చేయటం చూసిన వాళ్ళు, ఆయన ఎంత ఆవేదనకు లోనవుతున్నారో అర్ధం అవుతుందని వాపోతున్నారు.