2016 వరకు పోలవరం ప్రాజెక్ట్ ఎలా నత్త నడకన నడిచిందో చూసాం. ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ రాష్ట్రం చేతికి వచ్చిందో, చంద్రబాబు వేగంగా మార్పులు చేసారు. ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తయ్యేలా నవయుగ కంపెనీని రంగంలోకి దించారు. కేంద్రం మొదట్లో ఒప్పుకోకపోయినా, ఇలా అయితే ప్రాజెక్ట్ అవ్వదు, నవయుగ లాంటి వారికి ఇస్తేనే అవుతుందని, ఒప్పించి నవయుగకి ప్రాజెక్ట్ ఇప్పించారు. చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా, నవయుగ రాత్రి పగలు తేడా లేకుండా, పనులు పరిగెత్తించింది. ఇప్పటికీ పనులు వేగంగా సాగుతున్నాయి. కాంక్రీట్ వెయ్యటంలో, వరల్డ్ రికార్డు కు కూడా చేరువయ్యారు. ఈ ప్రాజెక్ట్ లో పెద్దగా లాభం లేకపోయినా, పాత రేట్లకే ప్రాజెక్ట్ ఇచ్చినా, మాతృభూమి మీద మమకారంతో, వాళ్ళు పని చేస్తున్నారు.
అయితే ఇది కేంద్రం తట్టుకోలేక పోతుంది. కేంద్రం సరైన సమయానికి డబ్బులు ఇవ్వకపోయినా, సొంత డబ్బులుతో రాష్ట్రం పనులు చేపిస్తుంది. నవయుగ కూడా పేమెంట్లకి ఎక్కడా కంప్రోమైజ్ కాకుండా, డబ్బులు ఇవ్వటం లేటైనా, పనులు పరిగెత్తిస్తున్నారు. దీంతో కేంద్ర పెద్దలకు కన్ను కుట్టింది. పోలవరం ప్రాజెక్ట్ కు ఇబ్బంది రావటానికి, నవయుగ పై కక్ష పెంచుకున్నారు. ఇంత బాగా పని చేస్తున్న వారిని అభినందించకుండా, ఐటి దాడులతో సత్కరించారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో ఐటి సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, హైదరబాద్ లోని నవయుగ కంపెనీ పై కూడా ఐటి దాడులు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లోని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయంలో గురువారం ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయం నుంచి 6 హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. నవయుగకు చెందిన 47 కంపనీల వ్యవహారాలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత నాలుగేళ్లుగా దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ప్రాజెక్టుల నిర్వహణపై అధికారులు విచారణ చేసినట్టు తెలిసింది. ఈ సోదాల్లో 20 మంది అధికారులు పాల్గొన్నారు. నవయుగ ఇంజనీరింగ్ కంపనీ లిమిటెడ్‌తో పాటు, నవయుగ బెంగళూరు టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ క్వాజీగండ్ ఎక్స్ ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్, నవయుగ రోడ్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్, కృష్ణా డ్రైడ్జింగ్ కంపనీ లిమిటెడ్ , కృష్ణా పోర్ట్ కంపెనీ లిమిటెడ్, శుభం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలగు కంపెనీ లావాదేవీలపై అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం. మొత్తంగా, ఆంధ్ర రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పుర్తిచేస్తున్న కంపెనీని, ఈ విధంగా ఇబ్బంది పెట్టి, లోబరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.