పోలవరం ప్రాజెక్ట్ నుంచి, తమను తప్పించటం పై, ఏపి ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ, నవయుగ కంపెనీ హైకోర్ట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ, జెన్కో కి షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లవు అంటూ కోర్ట్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఆ ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ జెన్కో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు పై నిన్న హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. వాదనలు జరిగిన సమయంలో, నవయుగ తరుపు లాయర్, గట్టి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వాన్ని, జెన్కో ని ఇరుకున పెట్టారు. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ నుంచి తమను తప్పిస్తూ, ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసే విషయంలో ఏపీ జెన్‌కో దురుద్దేశంతో వ్యవహరించిందని నవయుగ తరఫు న్యాయవాది పి.విల్సన్ హైకోర్టుకు విన్నవించారు. ఈ మొత్తం వ్యవహారం పై, ప్రభుత్వం వెనుక ఉండి , ఏపి జెన్కోని నడిపించిందని, హైకోర్ట్ కి తెలిపారు.
జగన్ మోహన్ రెడ్డి దగ్గర జరిగిన సమీక్షలో, మా ఒప్పందం రద్దుకు నిర్ణయం తీసుకోవటమే, ఇందుకు నిదర్శనం అని అన్నారు. మా ఒప్పందం రద్దు వెనుక, ప్రభుత్వం ఉందని, జెన్కో ఒప్పుకున్న విషయాన్ని, కోర్ట్ కు తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం పై జెన్కో తరుపున, గతంలో సంతకం చేసిన జెన్‌కో చీఫ్ ఇంజినీర్ ప్రభాకరరావు, ఇప్పుడు మా ఒప్పంద నిర్ణయం అక్రమం అని, చట్టవిరుద్ధమని ఆయనే చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. జెన్కో చీఫ్ ఇంజనీరే ఇప్పుడు కి దురుద్దేశాలు ఆపాదిస్తూ కోర్టుకు నివేదించారు కాబట్టి, ఆ చీఫ్ ఇంజనీర్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోర్ట్ కు తెలిపారు. ప్రభుత్వాలు మారితే అధినేతలు మారతారు కాని, విధానపరమైన నిర్ణయాలు, అధికారులు మారరని గుర్తు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని మూడో పార్టీగా చెప్తూ, వారు చెప్పినట్లు వ్యవహరించి తమతో చేసుకున్న ఒప్పందాన్ని ఏపీ జెన్‌కో రద్దు చేసుకుందని కోర్ట్ కు తెలిపారు. మూడో పార్టీ జోక్యం ఉన్నప్పుడు మధ్యవర్తిత్వ విధానాన్ని ఎలా ఆశ్రయించమంటారని ప్రశ్నించారు. ఈ ఒప్పందం రద్దు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగిందని, కనీసం నోటీసివ్వకుండా ఏకపక్షంగా మా ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు తమకు ఉందన్నారు. ఈ కాంట్రాక్టు రద్దు వెనుక ప్రభుత్వ దురుద్దేశం ఉంది కాబట్టి, హైకోర్టు ఇచ్చిన స్టేను యధాతథంగా ఉంచండి అంటూ అభ్యర్దించారు. నవయుగ బలమైన వాదనలు వినిపించటంతో, జెన్కో తరుపు లాయర్ కూడా, వాదనలు వినిపించారు. అక్కడ ఇప్పటి వరకు నవయుగ పనులు మొదలు పెట్టలేదు అంటూ, చెప్పుకొచ్చారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి, తీర్పును వాయిదా వేశారు.