ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా టీఆర్ఎస్ సారథి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ను కలిసిన రెండోరోజే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నవీన్ పట్నాయక్ ప్రతినిధిగా బీజేడీ ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ మంగళవారం అమరావతికి వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుమారు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారు. పోలవరం విషయంలో తెలంగాణ, ఒడిసా వైఖరులపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆయన స్వయంగా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో చురుగ్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు కూడా పాల్గొన్నారు. తమ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇచ్చిన లేఖను సౌమ్యా రంజన్ ఈ సందర్భంగా చంద్రబాబుకు అందించారు.
మహిళా రిజర్వేషన్లు, ఈవీఎం మిషన్లు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ప్రస్తావించారు ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్. తన ప్రతినిధిగా వెళ్లి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడి రావాలని ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ను ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పంపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఇటీవలి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేవనెత్తిన అభ్యంతరాలకు మద్ధతు తెలుపుతున్నట్టు ఒడిషా సీయం సందేశం పంపించారు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మద్దతు పలికారు. ఈ అంశంతో పాటు పలు జాతీయ అంశాల పై కలిసి పనిచేయాలన్న ప్రతిపాదన పై ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎంపీ సౌమ్యా రంజన్ పట్నాయక్ చర్చలు జరిపారు.
రెండు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యల్ని కూర్చుని చర్చించి సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ఒడిషా ఎంపీ రంజన్ పట్నాయక్, చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు జాతీయ స్థాయిలో జరిపే పోరాటంలో బాసటగా ఉంటామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒడిషా ఎంపీ పట్నాయక్ చెప్పారు. నవీన్ పట్నాయక్ గత 19 సంవత్సరాలుగా ఒడిషా సిఎం. స్వాతంత్య్రం రాకముందు నుండీ రాజకీయాల్లో ఉన్న కుటుంబం వాళ్ళది. ఆయనకి తెలియదా ఎవరి స్థాయి ఏంటో ? కెసిఅర్ తనని కలిసి వెళ్లిన మరునాడే తన ప్రతినిధిగా బిజెడి ఎంపి సౌమ్యా రంజన్ పట్నాయక్ ను చంద్రబాబు వద్దకు పంపారు. వివిధ అంశాల మీద , జాతీయ రాజకీయాల మీద నవీన్ పట్నాయక్ మనోగతాన్ని చంద్రబాబుకు సౌమ్యా రంజన్ వివరించారు. చిన్న చిన్న సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అని ఆయన చెప్పారు. అనేక విషయాల్లో చంద్రబాబుకు తమ సంఘీభావాన్ని తెలిపారు..