పదేళ్ళ నెల్లరు జిల్లా వాసుల కల సాకారం కానుంది. దగదర్తి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంఖుస్థాపన చెయ్యనున్నారు. వచ్చే నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. పారిశ్రామికంగా ఎదుగుతున్న జిల్లాకు విమానాశ్రయం అవసరమని గత ప్రభుత్వం గుర్తించినా, భూసేకరణ జాప్యం కావడం, ప్రభుత్వంలో పాలకుల ఉదాసీనతతో విమానాశ్రయం పనులు ముందుకు సాగలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ దగదర్తి వద్ద విమానాశ్రయం నిర్మించాల్సిందేనని నిర్ణయించింది. దీని కోసం భూసేకరణ చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు అందాయి. పదేళ్లుగా ఈ విమానాశ్రయం కోసం పాలకులు ఎన్నో హామీలు గుప్పించి ఇదిగో వస్తోంది. అదిగో వస్తోంది. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. చంద్రబాబు సర్కార్ ఈ విమానాశ్రయం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అడ్డంకులు తొలగి నిర్మాణానికి మార్గం సుగమమం అయింది.
దగదర్తి విమానాశ్రయం కొరకు 1051 ఎకరాల భూములు గ్రీన్‌ఫీల్డ్ ఎయిపోర్ట్ నిర్మాణ సంస్థ అప్పగించారు.. విమానాశ్రయ నిర్మాణానికి ప్రస్తుతం రన్‌వే, ఇతర నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన భూములను అప్పగించామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇచ్చిన భూములతో నిర్మాణం చేపట్టడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కొన్ని భూములకు సంబంధించి న్యాయపరమైన అంశాలు ఉన్నా.. వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పటి వరకు అప్పగించిన 1,051 ఎకరాల్లో.. పట్టా భూములు 231.39 ఎకరాలు, డీకేటీ భూములు 151.11 ఎకరాలు, సీజేఎఫ్‌ఎస్ భూములు 301.91 ఎకరాలు, ఏ.డబ్ల్యూ భూములు 137.57 ఎకరాలు, పోరంబోకు భూములు 226.11 ఎకరాలను విమానాశ్రయ నిర్మాణ సంస్థకు అప్పగించారు.
గ్రీన్‌ఫీల్డ్ ఎయిపోర్ట్ నిర్మాణ సంస్థ తరఫున అధికారుల బృందం కూడా జిల్లాకు వచ్చి సమీక్ష నిర్వహించి వెళ్లింది. ఇంకా సేకరించాల్సిన 336 ఎకరాల్లో.. పట్టా భూములు 104.9 ఎకరాలు ఉండటం గమనార్హం. డీకేటీ భూములు 23.42 ఎకరాలు, పోరంబోకు భూములు 208.14 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 1,051 ఎకరాలు సేకరించారు భూముల సేకరణ.. పరిహారం రైతులకు ఇవ్వటం మాత్రమే పూర్తయింది. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ నెలలో సీఎం జిల్లా పర్యటన ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో దగదర్తి విమానాశ్రయానికి శంకుస్థాపన కూడా చేయించాలన్న ఆలోచనలో ఉన్నారు. దాదాపు దశాబ్దకాలం ఎదురుచూపులకు నిరీక్షణ ఫలిస్తున్నది.