పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన నెల్లూరు మున్సిపల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు సాధించారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. గత నెలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పరీక్షలకు 49 విద్యార్థులు హాజరు కాగా.. 32 మంది 10కి 10 జీపీఏ, మరో 12 మంది 9.8, మిగిలిన ఐదుగురు 9.5 జీపీఏ సాధించారన్నారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాబోయే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఇటువంటి బోధన విధానం అమలు చేయనున్నామని మంత్రి తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థులతో కలిసి మంత్రి నారాయణ మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలు కార్పొరేట్ ధీటుగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారన్నారు.
ఆయన ఆశయ సాధనలో భాగంగా ఇప్పటికే ప్రాథమిక విద్యలో రాష్ట్ర ప్రభుత్వం పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభించిందన్నారు. ఈ ఫౌండేషన్ కోర్సుపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, మేధావులు అభినందనలు తెలియజేస్తున్నారని తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 49 మంది నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసి, పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించి అందులో వారికి ఇంటర్మీడియట్ కోర్సులో విద్యాబోధన చేశామన్నారు. విద్యార్థులకు బోధన చేయడానికి ప్రభుత్వంతో నారాయణ విద్యాసంస్థలు రెండేళ్లకుగానూ ఎంవోయూ కుదుర్చుకున్నాయన్నారు.
ఉపాధ్యాయులు బోధనతో పాటు నారాయణ విద్యా సంస్థల నుంచి పుస్తకాలు, మెటీరియల్ అందించామన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలోనే గవర్నమెంట్ విద్యార్థులు ఇటువంటి ఫలితాలు సాధించారన్నారు. విద్యకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన మున్సిపల్ జూనియర్ కళాశాలలను రాబోయే విద్యా సంవత్సరంలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లోనూ పిల్లలకు వయస్సుకు తగ్గ బోధన చేస్తున్నామన్నారు. మరో 3 వేల స్కూళ్లలో పూర్తి స్థాయిలో వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఫ్రీ స్కూళ్లగా మార్చలేకపోయామని త్వరలోనే వాటిని కూడా ఫ్రీ స్కూళ్లగా మార్చుతామని మంత్రి నారాయణ తెలిపారు.
స్కూళ్ల ఎడ్యుకేషన్ మాదిరిగా కాలేజీ విద్యను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. విద్యా సంస్కరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏపీకి మొదటి ర్యాంకు ఇచ్చిందన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో నిరుపేద విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడంలో మంత్రి నారాయణ కృషి ఎంతో ఉందన్నారు. పేదరికం అనేది చదువుకు భారం కాకూడదని మంత్రి భావించడం వల్లే నిరుపేద విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించగలిగారన్నారు. తొలుత విద్యార్థులతో కలిసి మంత్రి నారాయణ సీఎం చంద్రబాబును ఆయన కార్యాలయంలో కలవగా విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.