ఏపీ మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ అంటే, విపక్షాలు ఎలా విరుచుకుపడతాయో చూస్తూ ఉంటాం... నారాయణ విద్యా సంస్థల కోసం,మంత్రి నారాయణ అవినీతి చేస్తున్నారు అని, అదని, ఇదని ఎన్నో విమర్శలు చేస్తాయి... ప్రభుత్వ విద్యను కావాలని, బ్రస్టు పట్టిస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తాయి... అయితే, వాళ్ళు ఏ విమర్శ అయితే చేసారో, వాటికి సమాధానం చెప్పేలా, నారాయణ చేసిన పని, ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వాస్తవానికి నారాయణ పేదకుటుంబంలో పుట్టారు. కిరోసిన్ దీపం వెలుగులో చదువుకున్నారు. ఆయన తండ్రి బస్సు కండెక్టర్. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే నారాయణ చదువుకున్నారు. చదువుతోనే ఏదైనా సాధ్యమని గ్రహించారు. డిగ్రీలో యూనివర్శిటీ ఫస్ట్ ర్యాంకు సాధించారు. గోల్డ్ మెడల్ అందుకున్నారు. తిరుపతి ఎస్.వి యూనివర్విటీలో పీజీ చేశారు. అక్కడా కూడా ఫస్ట్ ర్యాంకరే! మరో గోల్డ్ మెడల్ సాధించారు. నెల్లూరులో డిగ్రీ చదువుకున్న వి.ఆర్. కాలేజీలోనే గెస్ట్ లెక్చరర్‌గా చేరారు. అప్పట్లో రోజుకి నాలుగు రూపాయల వేతనం. ఇంటి దగ్గర ట్యూషన్లు మొదలెట్టారు. నారాయణ ప్రతిభని చూసి ఎయిడెడ్ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అది పర్మినెంట్ అయ్యింది. ఒక పక్క ట్యూషన్లు కూడా కొనసాగిస్తూ అంచలంచెలుగా ఎదిగారు. ప్రైవేటు జూనియర్ కాలేజీలు నెలకొల్పారు. అలా సక్సెస్ రేట్ పెంచుకుంటూ ఉన్నతస్థాయికి చేరారు. అపర కోటీశ్వరుడయ్యారు. ఇదంతా ఎవరో చెప్పింది కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులను ఉద్దేశించిన అప్పుడప్పుడూ నారాయణ చెప్పే విషయాలే!
అయితే, ఆయన మంత్రి అయిన తరువాత, విపక్షాలు ఆయాన పై, విమర్శలు గుప్పిస్తూ వచ్చాయి... ఈ నేపథ్యంలో గత ఏడాది నారాయణ ఒక ప్రయోగం చేపట్టారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏదైనా చేయాలన్న తలంపు ఆయనకి కలిగింది. ఇందుకోసం ప్రభుత్వ విద్యావిధానంలో మార్పుకి ఏదో ఒకచోట శ్రీకారం చుట్టాలని భావించారు. నెల్లూరు వి.ఆర్. కాలేజీ ఆవరణలో మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీని ప్రారంభించారు. 49 మంది నిరుపేద విద్యార్థులకి అక్కడ చదువుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు- స్వయంగా ఆయనే ఐ.ఐ.టి, నిట్ ఫౌండేషన్‌తో ప్రత్యేక కోర్సును డిజైన్ చేశారు. వారానికొకసారి మంత్రి నారాయణ ఈ కాలేజీకి వచ్చేవారు. పిల్లలతో మాట్లాడేవారు. వారికి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే ప్రావీణ్యులైన అధ్యాపకులతో పాఠాలు చెప్పించారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, అధికారులు, మేయర్ అబ్దుల్ అజీజ్ వంటి ప్రముఖులు తరుచూ ఇక్కడికి వచ్చి వసతులు, బోధన తదితర అంశాలను పరిశీలించి వెళ్లేవారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఈ కాలేజీపైనా వారు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీ పేరు మీద నిధులు దోచేస్తున్నారహో అంటూ ధూంధాం చేశారు. అయితే, మొన్న వచ్చిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్య పోయారు... ఇక్కడి విద్యార్థులు అద్భుతం చేసి చూపించారు. నూరుశాతం ఉత్తీర్ణులయ్యారు. అంతే కాదు ఏకంగా 32 మంది పదికి పది పాయింట్లు సాధించారు. 12 మంది 9.8 పాయింట్లు, అయిదుగురు 9 పాయింట్లకి పైగా మార్కులు పొందారు. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే ఏ కార్పొరేట్ కాలేజీ కూడా సాధించనంత గొప్ప విజయాన్ని అందించారు. ఈ రిజల్ట్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆశ్చర్యపోయారు. వెంటనే మున్సిపల్ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులని తన వద్దకి పిలిపించుకున్నారు. అందరినీ అభినందించారు. ఇదే తరహాలో ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటినీ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందట. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సీట్లు దొరకకుంటేనే ప్రైవేటు విద్యాసంస్థలకి వెళ్లి చదువుకునే రోజులు రావాలంటూ ప్రభుత్వ పెద్దల్లో చర్చలు కూడా సాగుతున్నాయట.