వైసీపీ ప్రభుత్వానికి తొందరగానే హనీమూన్ పీరియడ్ అయిపోయినట్టు ఉంది. 50 రోజులకే ఎమ్మెల్యే పై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ప్రతి రోజు జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి దగ్గర ఆందోళనలు చేస్తున్నా, అవి పెద్దగా వార్తల్లోకి ఎక్కలేదు. అయితే ఈ రోజు నెల్లూరులో ప్రజల తిరుగుబాటు చేసి, అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికారులు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో, కోట మండలం కొత్తపట్టణంలో లెథర్ ఫ్యాక్టరీ పై, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇక్కడ మీటింగ్ కు గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్, గూడూరు సబ్ కలెక్టర్ ఆనంద్ లు హాజరయ్యారు. అధికార పక్షానికి సంభందించి, పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఈ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చాలా ఏళ్ళగా పోరాటాలు చేస్తున్నారు. ఆయన కూడా ఇక్కడకు వచ్చారు.
అయితే ఇక్కడ తోళ్ళ పరిశ్రమ ఏర్పాటుకు మేము సిద్ధంగా లేవని, అక్కడకు వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. దీంతో సభ అంతా రసాభాస అయ్యింది. ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ ఎంత సర్ది చెప్పటానికి ప్రయత్నించినా, వాళ్ళు వినలేదు. ఈ తోళ్ళ పరిశ్రమ ఏర్పాటు వెనుక గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ హస్తం ఉందని, ఆయనకు 30 కోట్లు లంచాలు అందాయని నినాదాలు చేసారు. సొంత పార్టీ నేత అయిన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, ఈ ఉద్యమానికి నాయకత్వం వహించటంతో, ఎమ్మెల్యే కూడా షాక్ అయ్యారు. ప్రజలు తిరగబడి, స్టేజి పైన ఉన్న కుర్చీలు, టేబుల్స్ ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు అతి కష్టం మీద ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ ను అక్కడ నుంచి, సురక్షితంగా బయటకు తరలించారు. తోళ్ళ పరిశ్రమ వద్దు అంటూ ఇక్కడ 10 ఏళ్ళుగా పోరాటం జరుగుతుంది.
2010 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, కోట మండలం, కొత్తపట్నం పంచాయతీ పరిధిలో కెపిఐఎల్ కృష్ణపట్నం పోర్ట్ ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్, ఇండిస్టీ ఏర్పాటుకు సిద్ధం అయ్యింది. అప్పటి నుంచి ఈ పరిశ్రమ మాకు వద్దు అంటూ ఆందోళనలు చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత, ప్రజల సెంటిమెంట్ గ్రహించి, పరిశ్రమ వర్గాలు ఎంత ఒత్తిడి చేసినా, ఇక్కడ పరిశ్రమను మాత్రం ఏర్పాటు చెయ్యలేదు. అయితే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం రావటంతో, పరిశ్రమను పెట్టాలని మళ్ళీ డిసైడ్ అయ్యారు. దీనికి వైసిపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో, పరిశ్రమను పెట్టటానికి రెడీ అయ్యారు. దీంతో ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించటంతో, అక్కడ ప్రజలు అందరూ, ఈ ఫ్యాక్టరీ మా దగ్గర వద్దు అంటూ తీవ్ర ఆందోళన చేసారు, ఎమ్మెల్యేను కొట్టే దాకా వెళ్లారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.