వైసీపీకి తిరుగులేని సీట్లు, ఓట్లు తెచ్చిన నెల్లూరు జిల్లాలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. నెల్లూరు పెద్దారెడ్లు తమ పార్టీ అధినేతపైనే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొద్దిరోజులుగా సర్కారు తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రోజులుగా వైసీపీ అధిష్టానంపై ధిక్కారస్వరం పెంచేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని, తన తమ్ముడిని సమన్వయకర్తగా నియమించాలని చూస్తున్నారని వైసీపీపై ఆరోపణలు చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో టిడిపి నెల్లూరు రూరల్ సీటుపై పోటీ చేస్తానంటూ ఆడియో కూడా వైరల్ చేశారు. అటువైపు నుంచి కోటంరెడ్డి ఎటాక్ సమయంలోనే నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక... చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ పెద్దల్ని టార్గెట్ చేశారు. వైసీపీ సర్కారు తన ఫోన్ ట్యాప్ చేస్తోందంటూ ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి వెల్లడించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనైన తన ఫోన్ ట్యాప్ చేయడంతో చివరికి తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటే వాట్సాప్ కాల్స్ చేసుకుంటున్నానని వాపోయారు. మొత్తానికి వైసీపీ ఎమ్మెల్యేలు, అందులోనా సీఎం సామాజికవర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా పట్టడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో సమీకరణాలు మారిపోయాయి. మరింత మంది అసమ్మతి గళం ఎత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన నెల్లూరు వైసీపీ పెద్దారెడ్లు
Advertisements