ఐటీ, ఐటీఈఎస్, క్రీడలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ తదితర రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక సాయాన్ని అందించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన వివిధ సంస్థలు ఆసక్తి కనబరిచాయి. ఈ విషయాన్ని మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి నెదర్లాండ్స్ రాయబారి మార్టెన్ వాన్ డెన్‌బెర్గ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్న 17 సంస్థల ప్రతినిధులను డెన్‌బర్గ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నానని ముఖ్యమంత్రికి చెప్పిన డెన్‌బెర్గ్, నెదర్లాండ్స్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు అనేక అంశాల్లో సారూప్యత ఉందన్నారు. విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి ఉందని, వాటర్ వేస్, వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ వాటర్, యానిమల్ న్యూట్రిషన్, స్మార్ట్ సిటీ, సాఫ్ట్‌వేర్, ఇంథన రంగాల్లో ఈ సంస్థలకు అనుభవం ఉందని డెన్‌బర్గ్ ముఖ్యమంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను నెదర్లాండ్స్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. సమర్ధత, ఆకర్షణ, సులభతర వాణిజ్యం నెదర్లాండ్స్ సొంతమని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్‌లో భారతదేశంలోనే ముందుదని చెప్పారు. ఐటీ, ఐవోటీ, ఇంథన రంగాల్లో తమ రాష్ట్రం దూసుకుపోతోందని అన్నారు. సాంకేతిక సాయంతో తుఫాన్ల గమనాన్ని ముందే పసిగట్టి నష్టనివారణ చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఉత్తమ మానవ వనరులు, సులభతర వాణిజ్య అవకాశాలు, సమృద్ధిగా విద్యుత్-నీరు ఆంధ్రప్రదేశ్‌కు కలిసొచ్చే అంశాలుగా చెప్పారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిపెట్టడం ద్వారా యూనిట్ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును తగ్గించగలిగామని అన్నారు. ప్రాజెక్టులలో సెన్సర్లు ఏర్పాటు చేయడం ద్వారా నీటినిల్వల గణాంకాలు తెలుసుకోగలుగుతున్నామని చెప్పారు.
ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. పాక్వెస్ ఎన్విరాన్‌మెంటల్, కాబా ఇన్ర్ఫాటెక్, రాయల్ హాస్కోనింగ్ డీహెచ్‌వీ, వాన్ ఊర్ద్ ఇండియా, కంపేక్ ఐటీ, ఎకోబ్లిస్ ప్యాకేజింగ్, ట్రో న్యూట్రీషన్, ఎఫ్1 స్టూడియోజ్, స్విచ్ గేర్ అండ్ స్ట్రక్చర్స్, మావిటెక్, డీహ్యూస్ యానిమల్ ఫీడ్, డీఎస్‌ఎం, ప్లానాన్ ఇండియా, ఫోరమ్ రీసెర్చ్, అలార్ గ్రూప్, సోలిదరిదాద్, ఈ ఫ్రెష్ ఇండియా సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రితో ముఖాముఖి చర్చించారు. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, వాటర్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ టెక్నాలజీని ఏపీకి అందిస్తామని నెదర్లాండ్స్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ సమావేశంలో నెదర్లాండ్స్ ఎకనామిక్ సెక్షన్ విభాగాధిపతి మైఖేల్ బైర్కెన్స్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ఏవీ రాజమౌళి, ఏపీఎన్ఆర్‌టీ వ్యవహారాల సలహాదారు వేమూరు రవికుమార్ పాల్గొన్నారు.