పర్యాటకులకు మజానిచ్చే జెట్ స్పీడ్ బస్ బోట్ కృష్ణానదిలో చక్కర్లు కొట్టింది. కొద్దిరోజుల నుంచి నిర్వహిస్తున్న ట్రయల్ రన్ విజయవంతంగా ముగియటంతో పర్యాటకశాఖ ఈ బోటును ప్రారంబించింది. రూ. 1.17 కోట్లతో కొనుగోలు చేసిన ఈ లగ్జరీ క్రూయిజ్ చూడటానికి జలాంతర్గామిలా, లోపల బస్సులా ఉంటుంది. ఏపీటీడీసీ దీనిని బెంగళూరు నుంచి కొనుగోలు చేసింది. ఏసీ, లగ్జరీ సీటింగ్, ఆడియో, వీడియోకోచ్ సదుపాయాలు ఉన్నాయి. పై భాగంలో గ్లాస్ ఉంటుంది. సోమవారం నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది.
ఇందులో 30 లగ్జరీ సీట్లు ఉంటాయి. సెంట్రలైజ్‌డ్ ఏసీ సిస్టమ్ ఉంటుంది. ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు. ఇది చాలా స్పీడ్‌గా వెళుతుంది. ప్రయాణికులు లోపల కూర్చుని నదిలో వెళ్లేటప్పుడు ఆనందంగా, ఆహ్లాదంగా గడిపే విధంగా అత్యాధునిక ఏర్పాట్లు చేశారు. భవానీ ద్వీపాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఎండీ శుక్లా, చైర్మన్ జయరామిరెడ్డి అన్నారు. భవానీ ఐలెండ్ వద్ద బస్‌బోటు, లగ్జరీ బోటు, భవానీ ఐలాండ్ లోపల కొత్తగా నిర్మించిన రెస్టారెంట్, బ్యాటరీ వాహనాలను వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ జయరామిరెడ్డి మాట్లాడుతూ భవానీ ఐలాండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం కూడా పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టిసారించిందని చెప్పారు. ఎండీ శుక్లా మాట్లాడుతూ గత ఏడాది 95 శాతం అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. పర్యాటక శాఖ సిబ్బంది సహకారంతో ఈ అభివృద్ధి సాధ్యమైందన్నారు.