బెజవాడలో కొత్త రూట్‌ను ఆర్టీసీ ఆవిష్కరించింది. అత్యంత రద్దీగా ఉండే మూడు నియోజకవర్గాలలోని కీలక ప్రాంతాలను కలుపుతూ 24 కిలో మీటర్ల దూరంతో కూడిన సరికొత్త రూటును ప్రవేశపెట్టారు. మాస్, క్లాస్ ఎక్కువుగా రాకపోకలు సాగించే పొటెన్షియల్ రూట్ల వేటలో ఉన్న ఆర్టీసీ అధికారులు కొద్ది రోజులుగా వీటిపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదరణ బాగా ఉంటుందని రూట్ నెంబర్ 33 హెచ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ రూట్ పశ్చిమ నియోజకవర్గంలో హెచ్‌బీ కాలనీ నుంచి ప్రారంభమై మధ్య నియోజకవర్గంలో పైపుల రోడ్డు మీదుగా తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్‌కు అనుసంధానమౌతుంది.
పశ్చిమ, మధ్య నియోజకవర్గ శివారు ప్రాంత ప్రజలంతా ఆటోనగర్‌కు రావాలంటే నగరం అంతా కలియ తిరిగి రావాల్సి వస్తోంది. ట్రాఫిక్ ఇబ్బందులలో చిక్కుకోవాల్సి వస్తోంది. దీని వల్ల సమయాభావంతో పాటు అనేక ప్రయాసలు పడాల్సి వస్తోంది. రూట్ నెంబర్ 33 హెచ్ ద్వారా ఈ సమస్యకు తెరపడుతుంది. సమయాభావం కూడా కలిసివస్తుంది. చెంతనే రాజధాని ఏర్పడిన తర్వాత సిటీ డివిజన్ పరిధిలో తొలిసారిగా అంతర్గత రూట్‌కు ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టడం ఇదే తొలిసారి. ఇటీవల ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫోన్‌కాల్స్, ప్రత్యేక విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని రీజియన్ అధికారులంతా సమావేశమై ఈ రూట్‌ను సృష్టించారు.
పశ్చిమ నియోజకవర్గంలో 33 హెచ్ రూట్ ప్రారంభ మౌతుంది. హె చ్బీ కాలనీ నుంచి సితార, కబేళల మీదుగా మైలవరం నియోజకవర్గం పరిధిలోని జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి వె ళుతుంది. అక్కడి నుంచి మధ్య నియోజకవర్గంలో పైపులరోడ్డు మీదుగా డాబాకొట్లు, గవర్నమెంట్ ప్రెస్ జంక్షన్, అల్లూరి సీతారామరారాజు వంతెన మీదుగా బీఎస్ఎన్ఎల్ ఆఫీసు నుంచి ఏలూరు రోడ్డుకు కలుస్తుంది. ఇక్కడి నుంచి రామవరప్పాడు రింగ్, రమేష్ హాస్పిటల్, గురునానక్ కాలనీ మీదుగా ఆటోనగర్‌కు బస్సు చేరుకుంటుంది. హెచ్‌బీ కాలనీ నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు , ఆటో నగర్ నుంచి ఉదయం 8.15 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు ఈ సర్వీసులు నడుస్తాయి.