భన్వర్లాల్... ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆయన పేరు అన్ని టీవీ ఛానెళ్లలో ప్రతిధ్వనిస్తూనే ఉండేది. అలాంటి భన్వర్లాల్ పదవి కాలం పోయిన ఏడాది అక్టోబర్ 31 (ఇవాల్టితో) ముగిసింది... అప్పటి నుంచి కొత్త ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఆయన స్థానంలో తెలంగాణ ఎన్నికల సంఘం ఇన్చార్జీ అనూప్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు...
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయి ముఖ్య ఎన్నికల అధికారిగా ఆర్పీ సిసోడియా నియామకానికి కేంద్ర ఎన్ని కల సంఘం ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భన్వర్లాల్ ముఖ్య ఎన్నికల అధికా రిగా వ్యవహరిస్తూ వచ్చారు. గతేడు అక్టోబరు 31న ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఆయా పోస్తులు ఖాళీ అయ్యాయి. నిజానికి భన్వర్లాల్ పదవీ విరమణకు కొద్ది రోజుల ముందు నుంచే ముఖ్య ఎన్నికల అధికారుల నియామకానికి అధికారుల జాబితాలను పంపాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాసింది. ఆంధ్రప్రదేశ్ పంపిన జాబితా నుంచి సిసోడియా నియామకానికి కేంద్ర ఎన్నికల సంఘం సంసిద్ధత వ్యక్తం చేసింది.
ఆయన వచ్చే వారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొంత కాలానికి ముఖ్య ఎన్నికల అధికారి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారుల జాబితాను కేంద్రానికి పంపింది. ఆ జాబితా పై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరో జాబితా పంపాల్సిందిగా కోరింది. అయితే తెలంగాణా ప్రభుత్వం ఈ అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదన్నది అధికార వర్గాల సమాచారం. తెలంగాణ సీఈవో పై నిర్ణయం వెలువడని నేపధ్యంలో, సిసోడియాకే తాత్కాలికంగా తెలంగాణా రాష్ట్ర బాధ్యతలు కూడా అప్పగిస్తారనే సమాచారం ఉంది...