రాష్ట్రానికి మళ్లీ కొత్త డిజిపి ఎవరనేది చర్చనీయాంశమైంది. కొత్త పోలీస్ బాస్ ఎంపికకు కసరత్తూ సాగుతోందని సమాచారం. ఈ నెలాఖరుకు ప్రస్తుత డిజిపి ఎం మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్నారు. డిజిపి ఎంపికకు గతంలోలా కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పోలీస్ యాక్ట్‌కు 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తెచ్చిన విషయం విదితమే. వచ్చే సాధారణ ఎన్నికల దృష్ట్యా కీలకమైన డిజిపి ఎంపిక ప్రభుత్వంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో డిజిపి ఎంపిక సీనియార్టీ ప్రాధాన్య క్రమంలో సాగేది. సీనియార్టీ ప్రకారమైతే 1983 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఎస్వీ రమణమూర్తి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారు. అనంతరం 1986 బ్యాచ్‌కు చెందిన విఎస్కె కౌముది ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో సిఆర్పిఎఫ్ అదనపు డిజిగా జమ్ము, కాశ్మీర్ డివిజన్లో విధులు నిర్వహిస్తున్నారు. వినరురంజన్ రే జైళ్ల శాఖ డిజిగా ఉన్నారు.
ఆ తరువాత ఒకేరోజు విధుల్లో చేరిన 1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారులు ఆర్పీ ఠాకూర్, గౌతమ్ సవాంగ్ డిజి హోదాలోనే ఉన్నారు. 2017 డిసెంబర్లో సాంబశివరావు పదవీ విరమణ చేసిన తర్వాత డిజిపి పదవి కోసం ఠాకూర్, సవాంగ్ ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ వారు యత్నిస్తారని పలువురు అంచనా వేస్తున్నారు. మరో రెండు వారాల్లోనే కొత్త డిజిపిని ఎంపిక చేయాల్సిన పరిస్థితుల్లో ఆశావహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎసిబి డిజి ఆర్పీ ఠాకూర్, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, హోంశాఖ కార్యదర్శి అనురాధ, ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు పేర్లు వీరిలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అవినీతి నిరోధక శాఖకు సంబంధించి కొన్ని కీలక కేసులు నమోదు చేయడంతో తెలుగుదేశం పార్టీ పరంగా ఠాకూర్‌కు గ్రీన్‌సిగల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సత్సంబంధాలు గల విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు వీరిద్దరూ ఉత్తర భారతదేశానికి చెందిన వారని, వారికి పదవి ఇస్తే ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అందుకే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి డిజిపి ఇవ్వాలని కొందరు అధికారులు ప్రభుత్వానికి అనధికార నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో 1987 బ్యాచ్‌లో సీనియర్, ప్రస్తుత హోం శాఖ కార్యదర్శి ఎఆర్ అనురాధ పేరు కూడా డిజిపి రేసులో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఆనవాయితీ ప్రకారం ఆర్టీసి ఎండినే, తదుపరి డిజిపి అవుతున్నారు. ఇలా చూస్తే ఆర్టీసి ఎండిగా సురేంద్రబాబు పేరూ ప్రభుత్వ పెద్దల దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఎన్నికల సీజన్ కావటంతో, సురేంద్ర బాబు వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే నిర్ణయం గురించి అంతా ఆసక్తికరంగా నిరీక్షిస్తున్నారు.