వైద్యసేవల్లో నూతన పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శనం కావాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. విశాఖ పట్నంలో నెలకొననున్న మెడ్ టెక్ వంటి పరిశోధనా సంస్థల ద్వారా నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని కోరారు. వెలగపూడిలోని సచివాలయంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య , సీఎంఓ కార్యదర్శి గిరిజా శంకర్ , సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. హెచ్ ఐవీ వంటి వ్యాధులు ప్రబలడానికి కారణమైన సిరంజ్ లను వాడకాన్ని క్రమబద్ధీకరించడానికి కొత్త వాటిని తీసుకు వస్తున్నారు. ఒకసారి మాత్రమే వాడే విధంగా కొత్తరకం సిరంజ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.
హిందుస్థాన్ సిరింజెస్ అండ్ మెడికల్ డ్రగ్స్ లిమిటెడ్ రూపొందించిన సిరంజ్ లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉపయోగించాలని సూచించారు. ఒకసారి రోగికి ఇంజక్షన్ చేస్తే ఆ సిరంజ్ నిరుపయోగంగా మారేలా రూపొందించారు. దేశంలో ప్రప్రథంగా రాష్ట్రంలోనే ఈ సిరంజిలను వాడుకలోకి తీసుకురానున్నారు. మరో పక్క, రాష్ట్రంలో రోగుల భద్రతకు, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ‘ఏపీ ఈఆర్‌ఎక్స్’ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.
దీని ద్వారా యాంటిబయాటిక్స్, టీబీ మందుల వాడాకాన్ని నియంత్రించనున్నట్లు స్పష్టంచేశారు. యాప్‌లో రోగి పేరు, చరవాణి సంఖ్య, వయసు, వ్యాధి, మందుల పేర్లు, ఎంతకాలంపాటు ఎంత మోతాదులో వీటిని వాడాలో వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. తద్వారా రోగికి ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా రాష్ట్రంలోని ఏ ఫార్మాసిస్ట్ వద్దనైనా మందులు కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. వైద్యులు మందులు రాసిన వెంటనే రోగి చరవాణికి సమాచారం(మెసేజ్) వెళుతుందన్నారు. మందు జనరిక్‌తో పాటు బ్రాండ్ పేరు కూడా రాసే అవకాశం ఉంటుందన్నారు. ఫార్మాసిస్టు ఆన్‌లైన్‌లో రోగి కోడ్ నమోదు చేయగానే వైద్యుడు రాసిన మందుల వివరాలు కనిపించేలా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు.