ఇటు శాసనసభ ఎన్నికల్లో టీడీపీదే గెలుపు.. అటు లోక్‌సభ సీట్లకు జరిగే ఎన్నికల్లోనూ సైకిల్‌కే ఎక్కువ సీట్లు.. అని న్యూస్ ఎక్స్ పోల్‌స్ట్రాట్ సర్వేలో తేలింది. ఆ సర్వే నివేదిక ప్రకారం.. శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ 2014తో(102) పోలిస్తే 10 సీట్లు కోల్పోయి 92 సీట్లు సాధించనుంది. ఆ పార్టీ ఓటు షేరు 37 శాతంగా ఉండబోతోంది. వైసీపీ 2014తో పోలిస్తే 10 సీట్లు పెంచుకుని 77 సీట్లు సాధించనుంది. ఆ పార్టీ ఓటు షేరు 35 శాతంగా ఉండబోతోంది. అంటే, టీడీపీ-వైసీపీ మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతమే!! గత ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయి మోడువారిన చెట్టులా మారిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ చిగురులు తొడిగే అవకాశం ఉందని.. 13 శాతం ఓటు షేరుతో ఆ పార్టీకి 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది.
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో గెలిచాక చెయ్యిచ్చిన బీజేపీకి 9 శాతం ఓట్లు, ఒక సీటు వస్తాయట. న్యూస్ ఎక్స్ సర్వేలో ఎక్కడా జనసేన పేరు లేదు. అసెంబ్లీ సీట్లలో ఇతరులకు 1 సీటు అని ఇచ్చారు. మరి అది జనసేనకో.. లేక స్వతంత్రులకో చూడాలి. ఎంపీ సీట్ల విషయానికి వస్తే వాటిలో కూడా 40% ఓట్లతో.. 16 సీట్లతో టీడీపీనే ముందుంది. వైసీపీకి 37 శాతం ఓట్లు.. 9 సీట్లు రానున్నాయి. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లలో 6 శాతం ఓట్లు.. హోదా విషయంలో నమ్మకద్రోహం చేసిన బీజేపీకి 3 శాతం ఓట్లు మాత్రమే రానున్నాయి. రెండు పార్టీలకూ ఎంపీ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని సర్వేలో తేలింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉత్తమం అనే ప్రశ్నకు.. 46 శాతం మంది చంద్రబాబుకే ఓటేశారు.
వైసీపీ అధినేత జగన్‌కు 39 శాతం మందే మొగ్గు చూపారు. ఇతరులకు 10 శాతం మంది ఓటేయగా.. 5 శాతం మంది తమకు తెలియదన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి సీట్లు ఎక్కువ వస్తాయనే ప్రశ్నకు.. టీడీపీకి అని 43% మంది సమాధానమిచ్చారు. వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని 37% మంది చెప్పగా.. కాంగ్రె్‌సకు ఎక్కువ సీట్లు వస్తాయని 6% మంది, బీజేపీకి వస్తాయని 7% మంది చెప్పారు. కాగా సీఎం చంద్రబాబు ఈ సర్వే పై స్పందించారు. న్యూస్‌ఎక్స్ చానెల్ పేర్కొన్న సీట్ల కంటే తమకు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా.. సర్వేలో పేర్కొన్న దాని కంటే ఎక్కువే ఉంటుందన్నారు.