‘అసలు సినిమా ముందుంది’ అన్నట్లుగానే జరుగుతోంది! ఆదాయపు పన్ను శాఖ సోదాల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా... ఆయన సన్నిహితులపై ఐటీ గురి పెడుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యూహంలో భాగంగానే వరుస సోదాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజకీయంగా ముఖ్యమంత్రికి సన్నిహితులుగా ఉన్న వారు, పార్టీకి ఆర్థికంగా సేవలందించిన వారిపై ఐటీ కన్ను వేసినట్లు తెలుస్తోంది. తొలుత నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుపై ఐటీ గురి పెట్టింది. తర్వాత ఒకేసారి 19 బృందాలు విరుచుకుపడ్డాయి.
ఆపై... రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఇప్పుడు... సీఎం రమేశ్ వంతు! ఇదే క్రమంలో త్వరలోనే రెండు ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలపైనా దాడులు జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఒకటి టీడీపీ నేతకు చెందిన సంస్థ. సోదాల్లో ఏం గుర్తించారు, ఏం స్వాధీనం చేసుకున్నారనే విషయాలపై ఐటీ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. వీటిపై ఎలాంటి అధికార ప్రకటనలు విడుదల చేయడంలేదు. ఆయా నేతలు, కాంట్రాక్టు కంపెనీలకు చంద్రబాబుతో ఉన్న సంబంధాలపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్న వారు, ఈ ఎన్నికల్లో సహకారం అందించే అవకాశమున్న వారితో ‘హిట్ లిస్ట్’ తయారైనట్లు సమాచారం. ఆయా కంపెనీలకు చెందిన సమస్త సమాచారాన్ని ఐటీ శాఖ ముందుగానే తెప్పించుకున్నట్లు తెలిసింది. కర్ణాటక ఎన్నికల నాటినుంచే తాము ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగా సమాచార సేకరణను ఐటీ శాఖ ప్రారంభించిందని అంటున్నారు. వాటి ఆధారంగా దాడులు జరపడం, ఏవైనా దొరికితే మరింత ముందుకెళ్లడం లక్ష్యంగా ఎప్పటికప్పుడు వ్యూహరచన చేసుకుంటోందని తెలిసింది.