కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర విభజన హక్కుల సాధన కోసం ఇక పై న్యాయపోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఇచ్చిన వివరణను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రేపటి నుంచి లోక్ సభలో ఆందోళన తీవ్రతరం చేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో శనివారం అవిశ్వాసానికి మద్దతిచ్చిన పార్టీల ప్రతినిధులతో చర్చించిన అనంతరం పార్టీ ఎంపీలతో ఆంతరంగికంగా సమావేశమై భవిష్యత్ వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. గత సార్వత్రిక సమావేశాల సందర్భంగా చేపట్టిన ఆందోళన తరహాలోనే గాంధీభవన్ సాక్షిగా నిరసన కార్యక్రమాలతో పాటు సభలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని అడుగడుగునా ప్రస్తావించేలా పట్టుపట్టాలని సూచించినట్లు తెలిసింది.
చట్టప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, మంజూరు చేయాల్సిన సంస్థల విషయంలో ప్రధాని, హోంమంత్రి పూర్తిగా అవాస్తవ ప్రకటన చేశారు.. సమాధానంపై స్పందించే అవకాశం కూడా ఇవ్వకుండా దారుణంగా వ్యవహరించారని సీఎం ఆక్షేపించారు. ఇదే విషయాన్ని సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆందోళనకు సంబంధించిన కార్యాచరణ రూపొందించు కోవాలని సూచించారు. ప్రధానంగా కేంద్రం అణచివేత చర్యలు, అగౌరవపరచే వ్యాఖ్యలపై స్పందించాలని ఎంపీలను ఆదేశించినట్లు సమాచారం. దిక్కున్నచోట చెప్పుకోవాలంటూ ప్రధాని స్థాయిలో చేసిన వ్యాఖ్యలను మరోసారి సమావేశాల దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా కోరినట్లు తెలిసింది.
కాగా సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కూడా అవాస్తవాలతో నిండి ఉందని, సమావేశాలు ముగిసేలోగానే దీనిపై న్యాయ నిపుణులను సంప్రతించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. లోక్‌సభలో మీరు స్పందించిన తీరు రాష్ట్రానికి స్ఫూర్తి అని ఎంపీలను అభినందించారు. ప్రత్యేకహోదా, ప్యాకేజీల విషయంలో కేంద్రం ఏ రకమైన ఇబ్బందులు పెట్టిందీ ప్రజలకు వివరించాలన్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర వైఖరిని మరింత ఎండకట్టాలని ప్రతిపక్ష పార్టీలకు కూడా స్వయంగా ఈ విషయాలన్నింటినీ వివరించాలని సూచించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పార్లమెంటులో ఐదు కోట్ల ఆంధ్రుల ఆవేదనను వినిపించిన ఎంపీ గల్లా జయదేవ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. శనివారం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన నేతలను కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అద్భుతమైన ప్రసంగం చేసిన ఎంపీ గల్లా జయదేవ్‌ను అభినందించారు.