ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రోజు రొజుకీ ఆందోళన కలిగించే విషయంగా మారుతున్నాయి. ఏకంగా ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని అరెస్ట్ చెయ్యటం, పెను సంచలనంగా మారింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ను, గవర్నర్ నియమిస్తారు. ఏ సమస్య వచ్చినా, ముందుగా గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళాలి. మన రాష్ట్రంలో మాత్రం, గవర్నర్ కు కూడా చెప్పకుండా, ఏకంగా ఒక యూనివర్సిటీ వీసిని అరెస్ట్ చెయ్యటం సంచలనంగా మారింది. అయితే హైకోర్ట్ లో బెయిల్ రావటంతో, ప్రస్తుతానికి ఈ వివాదం సద్దు మణిగింది. ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావటంతో, ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే ఈ వివాదానికి కాంట్రాక్టు ఉద్యోగి మురళీకృష్ణ ఫిర్యాదు చెయ్యటమే. మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకే, పోలీసులు వీసీ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
మురళీకృష్ణ చెప్పిన వివరాలు ప్రకారం, ఏప్రిల్ 12న తనను విధులు నుంచి తొలగించారని, ఉద్యోగంలోకి తిరిగి తీసుకోవాలని కోరిన సందర్భంలో, వైస్ ఛాన్సలర్ తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదు చేసారు. అయితే ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో, గవర్నర్ కు సమాధానం ఇవ్వకుండా, పోలీసులు దూకుడుగా వెళ్ళటం పై విమర్శలు వచ్చాయి. అయితే, నిన్న వైస్ ఛాన్సలర్ దామోదర నాయుడికి హైకోర్ట్ లో బెయిల్ మంజూరైంది. అయితే అన్ని యూనివర్సిటీల వీసిలను కొత్త ప్రభుత్వం రాజీనామా చెయ్యమని కోరిందని, ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వీసీ దామోదర నాయుడు మాత్రం అందుకు నిరాకరించటంతో, ఆయన పై ఇలా కేసులు పెట్టి ఒత్తిడి తెస్తున్నరనే ప్రచారం నడుస్తుంది.
ఈ అరెస్ట్ పై వీసీ దామోదర నాయుడు స్పందిస్తూ, తనపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, తాను ఎవరినీ కులం పేరిట దూషించలేదని చెప్పారు. ఈ కేసు విషయంలో, దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని ఆయన విమర్శించారు. అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తే సమర్ధవంతమైన అధికారులు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయలేరన్నారు. దీని వెనుక ఉన్న కధ మొత్తం తనకు తెలుసని, న్యాయస్థానంలో తనకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉందని అన్నారు. మరో పక్క, హైకోర్ట్ లో వాదనలు వినిపిస్తూ, వీసీ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన తరఫు న్యాయవాది హరిబాబు ఆరోపించటంతో, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అర్ధమవుతుంది. మరో పక్క గవర్నర్ అనుమతి లేకుండా వీసీని అరెస్ట్ చేసిన విషయన్ని కోర్ట్ ద్రుష్టికి తీసుకు వెళ్లారు.