నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రోజు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ కు భారీ జరిమానా విధించింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కింద కట్టిన ఎత్తిపోతల పధకాలకు కూడా జరిమానాలు విధించింది. ముఖ్యంగా పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇచ్చింది. కొంత మంది పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, మాజీ ఎమ్మెల్యే వసంత కుమార్ దాఖలు చేసిన పిటీషన్లను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ చేసింది. పోలవరం ప్రాజెక్ట్ కు పర్యావరణ అనుమతులు తీసుకున్నారని, అయితే వాటిని ఉల్లంఘించి పోలవరం నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆరోపిస్తూ కొంత మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లారు. అక్కడ తీసే మట్టి కానీ, అక్కడ ఊరు ఖాళీ చేసే సమయంలో పడగొట్టిన శిధిలాలు కానీ, అవి వేరే చోటికి తరలించే క్రమంలో, కొన్ని నిబంధనలు పాటించలేదు అంటూ, పోలవరం ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారు అంటూ, ఈ పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. దీని పైన అనేక కమిటీలను కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది. ఆ కమిటీలు ఇచ్చిన నివేదికలు ఆధారంగా, ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తన తుది తీర్పుని ఇస్తూ, భారీ జరిమానా విధించింది.
పోలవరం ప్రాజెక్ట్ కు మాత్రమే రూ.120 కోట్ల జరిమానా విధించారు. అలాగే పోలవరం కింద ఉన్న ఎత్తిపోతల పధకాలు అయిన, పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి లాంటి ఎత్తిపోతల పధకాలకు కూడా జరిమానా విధించింది. అసలు వీటికి పర్యావరణ అనుమతులు కూడా లేవని, ప్రభుత్వం తీసుకోలేదని, దీనికి కారణం, ఈ ప్రాజెక్ట్ లు అన్నీ పోలవరం ప్రాజెక్ట్ లో భాగమే కాబట్టి, పోలవరం పూర్తయ్యే లోగా, నీళ్ళను ఉపయోగించటం కోసమే, ఈ ప్రాజెక్ట్ లు తీసుకుంటున్నాం కాబట్టి, వీటికి ప్రత్యేకమైన పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఏపి ప్రభుత్వం వాదించింది. అయినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి ఒప్పుకోలేదు. పోలవరం ప్రాజెక్ట్ కే కాకుండా, కింద ఉన్న ఎత్తిపోతల పధకాలకు కడు జరిమానా విధించింది. పురుషోత్తంపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు జరిమానా కట్టాలని, మూడు నెలల్లోగా ఈ జరిమానాను చెల్లించాలని, ఏపి కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.