ఈ రోజు నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం అయిన నేపధ్యంలో, నామినేషన్లకు సంబంధించి, కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కుల ధృవీకరణ పత్రాలు జారీ విషయంలో, అలాగే ఎన్ఓసిలు జారీ చేసే విషయంలో, చీఫ్ సెక్రటరీకి, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసారు. కుల ధృవీకరణ పత్రాలు జారీ విషయంలో, అలాగే ఎన్ఓసిలు పత్రాల మీద, జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉంటుందని, ఆ సర్టిఫికేట్ ల పై, జగన్ మోహన్ రెడ్డి ఫోటోను తీసేయాలని నిమ్మగడ్డ లేఖ రాసారు. అభ్యర్ధులకు తాసిల్దార్ లు జారీ చేసే ఈ కుల ధృవీకరణ పత్రాలు, ఎన్ఓసి పై జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉండటం, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం అని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు తాసిల్దార్ లకు అందరికీ కూడా దీని పై తగు చర్యలు జారీ చేయాల్సిందిగా, చీఫ్ సెక్రటరీకి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసారు. కుల ధృవీకరణ పత్రాలు జారీ విషయంలో, ఎలాంటి వివక్ష , జాప్యం కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఇదే విషయం పై, ప్రతిపక్ష పార్టీలు అన్నీ, గవర్నర్ ను , అలాగే ఎలక్షన్ కమిషన్ ను కలిసి, ఈ విషయం పై ఫిర్యాదు చేసారు.
ఇది ఇలా ఉంటే, మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. జగన్ మోహన్ రెడ్డి కోటరీలో మోస్ట్ పవర్ఫుల్ గా పిలవబడే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పై చర్యలు తీసుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. ఎన్నికల విధులు నుంచి ప్రవీణ్ ప్రకాష్ ని తప్పించాలని, ఎలాంటి ఎన్నికలకు సంబందించిన విధుల్లో ఆయన పాల్గునకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. ఆయన కలెక్టర్ లతో కానీ, ఎస్పీలతో కానీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా చూడాలని ఆదేశించారు. ప్రవీణ్ ప్రకాష్ సకాలంలో నిర్ణయం తీసుకోవటంలో విఫలం అయ్యారని తెలిపారు. 23న వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్లు, ఎస్పీలు రావాల్సి ఉండగా, ఆ సమావేశం జరగనివ్వకుండా చేసారని, జేఏడీ అధిపతిగా ప్రవీణ్ ప్రకాష్ దీనికి బాధ్యులు అని, ఎన్నికలకు అధికారులను సన్నధం చేయటంలో విఫలం అయ్యారని, వీటి అన్నిటి వల్ల, ఎన్నికల షెడ్యుల్ వాయిదా వేయాల్సి వచ్చిందని, ఆ లేఖలో తెలిపారు. అయతే, ప్రభుత్వం ఈ చర్య పై ఎలా స్పందిస్తుందో చూడాలి.