ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వస్తుందా ? రాజ్యాంగ సంస్థల మధ్య ఘర్షణ వైఖరి, ఎటు దారి తీస్తుంది ? మొన్న శాసనమండలి, నిన్న కోర్టులు, ఈ రోజు ఎన్నికల కమిషన్, ప్రతి రాజ్యాంగ సంస్థతో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరితో, ఘర్షణ వాతావరణం ఇప్పుడు బహిరంగం అయిపొయింది. మొన్నటి దాకా మాటల వరుకే పరిమితం అయిన ఈ చర్యలు ఇప్పుడు, చర్యల వరకు వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఎలా వ్యావహరిస్తుందో అందరికీ తెలిసిందే. ప్రత్యెక ఆర్డినెన్స్ తెచ్చి మరీ ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ ను టార్గెట్ చేసి, ఆయన పదవి పోయేలా చేసింది. అయితే ఆయన న్యాయ పోరాటం చేసి, హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి, మళ్ళీ ఎన్నికల కమీషనర్ గా నియమించబడ్డారు. అయితే తరువాత హైకోర్టు ఆదేశాల మేరకు, ఎన్నికల ప్రక్రియ పై ముందుకు వెళ్లి, అన్ని రాజకీయ పార్టీలతో, ప్రభుత్వంలో ఉన్న అధికారలుతో సమీక్ష జరిపి, ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే దీని పై ప్రభుత్వం ససేమీరా అంటుంది. చివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్, హైకోర్టు ఆదేశాలు కూడా జత చేసి, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసి, తమకు సహకరించాలని కోరినా, ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేదు.
ఇంకా చెప్పాలి అంటే నిమ్మగడ్డ తాను కలెక్టర్ ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని, దానికి ఏర్పాట్లు చేయాలని చెప్పినా, చీఫ్ సెక్రటరీ రెండు సార్లు పట్టించుకోలేదు. ఇక ప్రభుత్వం కూడా కోర్ట్ కు వెళ్ళింది. ఫిభ్రవరిలో ఎన్నికలు జరపలేం అని క-రో-నా వైరస్ కారణం ఒకసారి, వ్యాక్సిన్ కారణం ఒకసారి చెప్పి కోర్టులో కేసు వేసారు. ఇది విచారణలో ఉంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం లేకపోవటంతో, నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా, ఒక రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమీషన్, ఒక రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ కేసు వేసింది. దీనికి సంబంధించి హైకోర్టులో పిటీషన్ వేసారు ఎన్నికల కమీషనర్. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ప్రభుత్వం లేఖలకు స్పందించటం లేదని, చీఫ్ సెక్రటరీ స్పందన సరిగా లేదు అంటూ, ప్రభుత్వం పై చర్యలు తీసుకోవాలని ఏకంగా కోర్టు ధిక్కరణ కింద పిటీషన్ వేయటం చర్చకు దారి తీసింది. ఇలా రాజ్యాంగ సంస్థల మధ్య పోరుతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరకు ఎటు పోతుందో అర్ధం కావటం లేదు. ప్రభుత్వం ఒకసారి జరుగుతున్న పరిణామాలు సమీక్ష చేసుకుని, రాజ్యాంగ సంస్థలను గౌరవించాల్సిన పరిస్థితి రావాలని కోరుకుందాం.