ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ వ్యవహారం పై నిన్న సాయంత్రం నుంచి, అటు ప్రభుత్వానికి, ఇటు ఎలక్షన్ కమిషన్ కు మధ్య, వివాదం కొనసాగుతుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్ళటం, మొదట అనుకూలంగా, తరువాత డివిజన్ బెంచ్ లో వ్యతిరేకంగా ప్రభుత్వానికి తీర్పు రావటం తెలిసిందే. అయితే ఈ సమయంలో ఎన్నికలకు సంబంధించి, 2021 ఓటర్ల జాబితాను, ఈ నెల 21న ప్రచురిస్తాం అని, ప్రభుత్వం తరుపున కోర్టుకు తెలిపారు. అఫిడవిట్ కూడా దాఖలు చేసారు. అయితే ఓటర్ల జాబితా మాత్రం బయటకు రాలేదు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ ఈ వ్యవహారంలో విఫలం చెందారని, ఎలక్షన్ కమీషనర్ ప్రకటించారు. అయితే ఈసి అనుమతి లేకుండా, నిన్న రాత్రి ప్రభుత్వం ఆ ఇద్దరినీ సస్పెండ్ చేసింది. అయితే, ఈ రోజు ఉదయం స్పందించిన ఎలక్షన్ కమిషన్, ఎన్నికలు జరుగుతున్న దశలో, ఏదైనా ఈసీకి చెప్పి చేయాలని, ప్రొసీజర్ ప్రకారం చేయాలనీ, ప్రభుత్వ ఉత్తర్వులు తిరస్కరించింది.
అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీరి పై సంచలన ఆదేశాలు ఇచ్చింది. వీరి పై అభిశంసన జారీ చేస్తూ, ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. "Guilty of serious offence" కింద ఈ ఆదేశాలు ఇచ్చినట్టు అర్ధం అవుతుంది. నిబంధనల ఉల్లంఘనలను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అభిశంసన ఉత్తర్వులు జారీ చేస్తూ, ఈ ఉత్తర్వులను తమ వెబ్సైటులో ఉంచింది ఎన్నికల కమిషన్. అయితే ఈ ప్రొసీడింగ్స్ లో, వీళ్ళు ఇరువురు, ఆయా స్థానంలో ఉండటానికి అనర్హులని ప్రకటిస్తూ, వీరిని వేరే డిపార్టుమెంటు కు బాదిలీ చేయాలని, ఆదేశించింది. ఈ ఉత్తర్వుల్లో ఎందుకు వీరి పై ఈ చర్యలు తీసుకుంది, పూర్తి వివరాలు ఇచ్చారు. ముఖ్యంగా ఓటర్ లిస్టు రెడీ చేయలేదని, వీరు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈసి చెప్పినా, వీరు విఫలం అయ్యారని పేర్కొన్నారు. దీని వల్ల ఇప్పుడు 3.60 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారని, దీనికి వీరే బాధ్యులని ఈసి గతంలోనే తెలిపింది. ఒక పక్క ఓటర్ల జాబితా రెడీ చేయకపోవటం, ఈసి ఆదేశాలు పాటించకపోవటం, అలాగే కోర్టులో తాము 21న ప్రచురిస్తాం అని చెప్పి ఉల్లంఘించటం వల్ల, ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.