ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా అయన ఒక ఆసక్తికర విషయం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, తనకు ఎదురైన అనుభవం గురించి నవ్వుతూ చెప్తారు. ఆయన మాట్లాడుతూ, తనకు గతంలో హైదరాబాద్ లో ఓటు ఉందని, అది అక్కడ సరెండర్ చేసి, గుంటూరు జిల్లా దుగ్గిరాలలో తన ఓటు నమోదు చేయమని స్థానిక తాసిల్దార్ ను అడిగినట్టు చెప్పారు. తన సొంత ఊరు దుగ్గిరాల అని, తనకు అక్కడ ఇల్లు, పొలం ఇతర ఆస్తులు అన్నీ ఉన్నాయని, కేవలం హైదరాబాద్ లో ఉద్యోగ రిత్యా, అక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఉంటూ, ఇక్కడ అక్కడ విధులు నిర్వహిస్తున్నా అని అన్నారు. అయితే, రేపు రిటైర్డ్ అయిన తరువాత, తాను ఎలాగూ దుగ్గిరాలలోనే ఉంటానని, అందుకే ఇక్కడ ఓటు హక్కు నమోదు చేసి, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు కూడా వేద్దామని అనుకున్నానని నిమ్మగడ్డ తెలిపారు. అయితే స్థానిక తాసిల్దార్ తనను, తన ముందు హాజరుకామన్నారని, అయితే ఆ రోజు చీఫ్ సెక్రటరీతో మీటింగ్ ఉందని, తరువాత ఎప్పుడు డేట్ ఇచ్చిన, మీ ముందు హాజరు అవుతానని తాసిల్దార్ కు చెప్పానని నిమ్మగడ్డ తెలిపారు. అయితే తాసిల్దార్ మాత్రం, మీరు హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారు అంటూ, తన ఓటు దరఖాస్తుని రిజక్ట్ చేసారని తెలిపారు.
అయితే తాను ఎన్నికల అధికారానిని అని చెప్పి, తాసిల్దార్ పై కక్ష సాధించలేదని అన్నారు. తాసిల్దార్ కు ఉన్న అధికారాలని గౌరవించానని, రూల్ అఫ్ లా అనేది అందరికీ ఒకటే ఉంటుందని, అందరూ దాన్ని ఫాలో అవ్వాల్సిందే అని తెలిపారు. ఆ ఉద్దేశంతోనే తాసిల్దార్ పై నేనేమి, కక్ష తీర్చుకోలేదని, అయితే ఇలా జరిగింది, నా దరఖాస్తు మరోసారి పరిశీలించమని, జిల్లా కలెక్టర్ ని కోరానని తెలిపారు. రేపు కలెక్టర్ కనుక ఒప్పుకోక పొతే, కోర్టుకు వెళ్తానని అన్నారు. నాకు ఉన్న హక్కులు నేను వాడుకుని ముందుకు వెళ్తాను కానీ, ఎవరి మీద కక్ష సాధింపు ధోరణితో వెళ్లలేదని అన్నారు. రూల్ అఫ్ లా అనేది అందరూ ఫాలో అవ్వాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్పను అంటూ, తనకు ఎదురైన అనుభవం గురించి నిమ్మగడ్డ చెప్పుకొచ్చారు. అలాగే మంత్రులు తన పై చేస్తున్న వ్యాఖ్యల పై స్పందిస్తూ, మంత్రులు అలా మాట్లాడటం సరి కాదని అన్నారు. ఇదే విషయం గవర్నర్ తో చెప్పినట్టు చెప్పారు. వ్యక్తిగతంగా నిందించటం తగదని, తన మాటగా మంత్రులు చెప్పమని, గవర్నర్ కు చెప్పమని చెప్పినట్టు నిమ్మగడ్డ చెప్పారు.