ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హఠాత్ గా సెలవుపై వెళ్తున్నారు. ఈనెల 19 నుంచి 22 వరకు కుటుంబ సభ్యులతో కలిసి మధురై & రామేశ్వరం వెళ్లనున్నారు. దీనికి సంబంధించి ఆయన గవర్నర్ ను పర్మిషన్ కోరారు. తిరిగి వచ్చిన తర్వాత ఈనెల 31న ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో నిమ్మగడ్డ హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న ఆశతో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది మార్చిలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియ ముగింపు కోసం నిరీక్షిస్తున్నారు. ఏడాది కాలంగా ప్రజల్లో ఉండటానికి అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. లాక్ డౌన్ సమయంలో సేవా కార్యక్రమాలు పేరుతో పెద్ద ఎత్తునఖర్చుపెట్టారు. ఏడాది కాలంగా వివిధ కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. తాజా పరిణామాలతో వారంతా నిరాశకు లోనవుతున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, రిజర్వేషన్లు మారిపోతాయని, అప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. ఇక అలాగే అధికార పార్టీ చేసిన అరాచకాలతో, ఏకాగ్రీవాలు చేసుకున్న వారు కూడా టెన్షన్ పడుతున్నారు.
ఇక మరో పక్క, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషన్ విధించిన ఎన్నికల కోడ్ ను గురువారం ఎత్తివేసింది. ముని సిపల్ ఎన్నికల నేపథ్యంలో 11 మునిసిపాలిటీల్లో మాత్రమే కోడ్ అమలులో వుంటుంది. పంచాయతీ ఎన్నికలు ముగియడంతో గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కోడ్ అడ్డంకిగా మారకుండా ఎన్నికల సంఘం ఈ నిర్ణ యం తీసుకుంది. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికల కోడ్ వల్ల చాలా గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలతో పాటు నూతన పాఠశాలల భవన నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రస్తుతం వేసవి మొదలుకావడంతో తాగునీటి సమస్య తీవ్రతరమైంది. కోడ్ అమలు లో వున్న కారణంగా అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. కొత్త సర్పంచులు బాధ్యతలు తీసుకొని గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టి ఆయా గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో 1,044 గ్రామ పంచాయతీలుండగా 1,086 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. కొన్ని పంచాయతీల్లో కోర్టు వివాదాల కారణంగా పెండింగ్ లో పెట్టారు. అక్కడ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది.