నిన్న సాయంత్రం, ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో సంచలనం రేపే వార్త, ప్రసారం అయ్యింది. ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని, సియం పేషీ అధికారులు, సమీక్షా సమావేశానికి రావాలి అంటూ మెసేజ్ చేయటం, పెను సంచలనంగా మారింది. ఎన్నికల నిర్వహణ అనేది, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ బాధ్యత. వాళ్ళు ఫైనల్ నిర్ణయం తీసుకుని ప్రభుత్వ సహకారం కోరతారు. అయితే ఇక్కడ ఏకంగా గుర్తు పెట్టుకోవాల్సింది, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను పిలిపించుకుని చర్చించుకునే అధికారం ముఖ్యమంత్రికి కూడా ఉండదు. కేవలం గవర్నర్ మాత్రమే చేయగలరు. ముఖ్యమంత్రికే హక్కు లేదు అంటూ, ముఖ్యమంత్రి పేషీ అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపారు. సియం ముఖ్య కార్యదర్శి ప్రావీణ్ ప్రకాష్, తాను 26వ తేదీన నిర్వహించే సమావేశానికి రావాలి అంటూ, నిమ్మగడ్డకు మెసేజ్ పంపించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీనియర్ అధికారులు అవాక్కయ్యారు. ఒక పక్క ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. అది పక్కన పెట్టినా, నిమ్మగడ్డ, ప్రవీణ్ ప్రకాష్ కంటే చాలా సీనియర్. రిటైర్డ్ అధికారి. అలాంటి అధికారిని, తన దగ్గరకు రివ్యూకి రమ్మని పిలవటం, కరెక్ట్ కాదని, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇది ఇలా ఉంటే, ప్రవీణ్ ప్రకాష్ పంపించిన మెసేజ్ పై, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా స్పందించారని వార్తలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ బాధ్యతలు, హక్కులు గుర్తు చేస్తూ, రాజ్యాంగా సంస్థ అని గుర్తు చేస్తూ, ఈ విషయం పై న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని, ఘాటుగా బదులు ఇచ్చారు.
అయితే ఈ వివాదం ఎటువంటి టర్న్ తీసుకుంటుందో అని అందరూ భావించిన టైంలో, అనూహ్యంగా ముఖ్యమంత్రి పేషీ అధికారులు దిగి వచ్చారు. సియం ముఖ్య కార్యదర్శి, నిమ్మగడ్డకు ఫోన్ చేసి, పొరపాటు జరిగిందని, ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ వాణీ మోహన్ కు పంపాల్సిన మెసేజ్ మీకు వచ్చింది అంటూ, పొరపాటు ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల కమీషనర్ మాత్రం, ఇది కావాలనే చేసిందనే అభిప్రాయంతో ఉన్నారు. ఒక వేళ తన సెక్రటరీకి ఈ మెసేజ్ పంపినా, తన అనుమతి లేకుండా వెళ్లరు కదా, అనేది ఆయన అభిప్రాయం. ఇప్పటికే ఈ ఎన్నికల విషయం కోర్టులో ఉన్నందున, ఈ విషయం పై కూడా కోర్టుకు ఫిర్యాదు చేసే యోచానలో ఉన్నారు. నిజానికి ఈ నెల 28న, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల పై, ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. ఈ తరుణంలో, అంతకంటే ముందే, 26 వ తేదీన, సియం పేషీలో ఉండే ముఖ్య కార్యదర్శి, ఎన్నికల పై రివ్యూ చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ముఖ్యమంత్రికే, ఎస్‌ఈసీ పై అధికారం లేనప్పుడు, ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది చేసిన పని పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయతే అవతల వైపు నుంచి తప్పు ఒప్పుకున్నారు కాబట్టి, ఈ సమస్య సద్దుమణుగుతుందా, లేక మళ్ళీ కోర్టుల దాకా వెళ్తుందా అనేది చూడాలి.