ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని టార్గెట్ చేసిన జగన్ ప్రభుత్వం, ఆయన పై ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ నోటీస్ పై ఆన్లైన్ లో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, మహారాష్ట్ర ఎన్నికల కమీషనర్ తరహాలో, నిమ్మగడ్డ పై కూడా చర్య తీసుకోవాలని వైసీపీ తరుపు సభ్యులు ప్రతిపాదించారు. అయితే దీని పై టిడిపి తరుపున అనగాని సత్యప్రసాద్ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకంచారు. దీంతో ఈ రచ్చ జరగటంతో, సమావేశం ఈ రోజుకి, ఏ నిర్ణయం తీసుకోకుండా ముగిసింది. ప్రివిలేజ్ కమిటీ తీరుపై అనగాని సత్యప్రసాద్ అసహనం వ్యక్తం చేసారు. ప్రివిలేజ్ కమిటీని కూడా వైసీపీ ప్రభుత్వం తన నియంతృత్వ విధానాలకు వాడుకుంటోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వ్యతిరకంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యానారాయణ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిందే తడవుగా.. విచారణకు రావలని పిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి హాజరైన టీడీపీ సభ్యులు అనగాని సత్యప్రసాద్ సమావేశం నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఉద్దేశించి తీవ్రమైన పదజాలం వాడిన మంత్రులపై చర్యలు తీసుకోకుండా.. ఎన్నికల కమిషనర్ పై చర్యలు అంటూ మాట్లాడడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అసలు ఎన్నికల కమిషనర్ కు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వడం బ్లాక్ మెయిల్ చేసేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
గతంలో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్సీ శివనాధరెడ్డిపై ఫిర్యాదు చేసిన సందర్భంలో.. గవర్నర్ నియమించిన తనపై సభా హక్కుల చట్టం కింద చర్యలు ఎలా తీసుకుంటారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అదే వైసీపీ నేతలకు.. ఎన్నికల కమిషనర్ ను కూడా నియమించింది గవర్నర్ అనే విషయం ఎలా మరిచిపోయారు.? తాము ఏం మాట్లాడినా తప్పులేదు.. కానీ.. తమను ఎదురించి మాత్రం ఎవరూ మాట్లాడకూడదు అనేలా మంత్రులు వ్యవహరించడం, రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాల్సిన స్పీకర్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పని చేయడం ఎంత మాత్రమూ రాజ్యాంగ బద్దం కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నోసార్లు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చినా స్పందించని స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన ఫిర్యాదులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందించడం విస్మయం కలిగిస్తోంది. ప్రివిలేజ్ కమిటీనే నవ్వుల పాలు చేసేలా ప్రభుత్వం వ్యవహరించడం ఎంత మాత్రమూ సరికాదని గుర్తుంచుకోవాలి అని అనగాని సత్యప్రసాద్ అన్నారు.