రాష్ట్రంలో పింఛన్లు పెంచుతూ సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం 24 గంల వ్యవధిలోన మరో సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలోని రైతాంగానికి ఇక నుంచి 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న 7 గంటల ఉచిత విద్యుత్తును 9 గంటలకు పెంచాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ఇంధన శాఖ, విద్యుత్తు సంస్థలను ఆదివారం ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు అవసరమైన ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా వ్యవసాయ కనెక్షన్న మంజూరులో పెండింగ్ లేకుండా చూడాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేశారు. 9 గంటల ఉచిత విద్యుత్తు వల్ల దాదాపు 17 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని, బంగారం లాంటి పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఆదివారం ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో విద్యుత్, ఇంధన శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.
రైతులకు 9 గంటలు ఉచిత సరఫరా చేయడానికి 2, 800 మిలియన్ యూనిట్లు అదనంగా విద్యుత్తు కావాల్సి ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేసినట్లు అజయ్ జైన్ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగి స్తున్న 10, 831 మిలియన్ యూనిట్లకు ఇది అదనమన్నారు. ఇందుకోసం దాదాపు రూ.1200 కోట్ల అదనపు వ్యయమవుతుందని వివరించారు. ఉచిత విద్యుత్తు, కొత్త కనెక్షన్లకు గాను ప్రస్తుతం వ్యవసాయ రంగానికి రాయితీ కింద రూ. 6, 030.17 కోట్లు ఖర్చవుతుండగా..9 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల రూ.7230.17 కోట్లకు చేరుతుందని అజయ్ జైన్ తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం .. తాను సీఎంగా ఉన్న సమయంలో 1994-2004 మధ్యకాలంలో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును అమలు చేసానని, మళ్లీ ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా 15 రోజుల క్రితమే 9 గంటల ఉచిత విద్యుత్తును ప్రకటించానని చెప్పారు.
రైతుల సంక్షేమం తప్ప తనకింకేదీ ప్రధానం కానే కాదని స్పష్టం చేశారు. తమది రైతు హిత ప్రభుత్వమన్నారు. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వంగా రైతులే ముందు అన్న నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. అన్నదాత లబ్ధి కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనకాడనన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు కోసం ఇంత భారీ మొత్తంలో రాయితీని దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని చెప్పారు. నాణ్యమైన ఉచిత విద్యుత్తు, అనేక ఇతర సంక్షేమ పథకాల ద్వారా రైతుల సాధికారతకు కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ కనెక్షన్లన్నింటినీ 2019 మార్చి నాటికి పూర్తి చేయాలని విద్యుత్తు సంస్థలను ఈ సందర్భంగా ఆదేశీస్తున్నా అని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తాను కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు.