ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే పనులు చాలా వరకు వివాదాస్పదం అవుతున్నాయి. ఎక్కువ సార్లు, అనాలోచితంగా చేస్తున్న పనులు, చివరకు ప్రభుత్వ మెడకు చుట్టుకుని, అభాసుపాలు అయ్యేలా చేస్తుంది. అయినా ప్రభుత్వ పెద్దలు మాత్రం, మారటం లేదు. మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు. చాలా కేసుల్లో కోర్టుల వరకు వెళ్లి, కింద కోర్టు నుంచి పై కోర్టు వరకు మొట్టికాయలు తింటున్నారు. అయినా ప్రభుత్వ పెద్దల్లో మార్పు లేదు. ఎక్కడ తప్పు జరుగుతుంది, మనం ఎక్కడ చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, నిబంధనలు ప్రకారం నడుచుకోవటం లేదు, రాజ్యాంగానికి లోబడి మన నిర్ణయాలు ఉండటం లేదా, అనే వాటి పై దృష్టి పెట్టటం లేదు. ఎవరైనా విమర్శ చేస్తే చాలు, వారి పై ఎదురు దాడి అస్త్రాన్ని ఎంచుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఈ రెండేళ్ళలో, ఇలా అనేక సంఘటనలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం చేసిన ఒక పని, విమర్శలకు తావు ఇచ్చింది. నిరంజన్ రెడ్డి అనే లాయర్ కు, ప్రభుత్వం రూ.96 లక్షలు ఫీజు కింద విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన రాజధానికి సంబంధించిన కేసుల్లో వాదించారని, అందుకని ఆ పేమెంట్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే అంత పెద్ద మొత్తంలో, ఒక లాయర్ కు డబ్బులు ఇవ్వటం పై, పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఒక ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో ఒక లాయర్ కు ఇవ్వటం, గతంలో ఎప్పుడూ లేకపోవటంతో, దీని పై లోతుగా విచారణ చేయగా, ఆ నిరంజన్ రెడ్డి అనే లాయర్, జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ తరుపున వాదించే న్యాయవాది అని తేలింది. దీంతో ఇది క్విడ్ ప్రోకో అంటూ, విపక్షాలు విమర్శలు గుప్పించాయి. జగన్ మోహన్ రెడ్డి సొంత పనులు కోసం, ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇస్తున్నారు అంటూ విమర్శించారు. అయితే ఈ ఆరోపణలు నేపధ్యంలో, ఈ రోజు ఈ అంశం పై, మరో సంచలన విషయం బయట పడింది. అసలు ఈ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి, రాజధాని కేసుల్లోనే ఎక్కడా పాల్గునలేదని, ఆయన ఎక్కడా వాదనలు వినిపించలేదు అంటూ, విజయవాడకు చెందిన లాయర్ సీహెచ్ విజయకుమార్ సంచలన ఆరోపణలు చేస్తూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఏపి రాజధాని కేసుల్లో అసలు నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పల్గున లేదని, ప్రభుత్వం ఇచ్చిన జీవో చట్ట విరుద్ధమని, ఆ జీవోని సస్పెండ్ చేయాలని చెప్తూ పిటీషన్ దాఖలు చేసారు. దీంతో ఇప్పుడు హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది.