యువనేస్తం అందిస్తోన్న స్నేహహస్తం అందుకుంటోంది లక్షలాది యువత. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో నిరుద్యోగుల భవితకు భద్రత కల్పించే భృతి ఇచ్చేందుకు ఉద్దేశించి.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 12 రోజులు ముగిసేసరికి ఈ వెబ్‌సైట్‌కి ఏకంగా 3,69,864 దరఖాస్తులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో పారదర్శకమైన ఎంపిక వ్యవస్థ ద్వారా 1,00,004 మంది అర్హులుగా గుర్తింపు పొందారు. అర్హులైన వారికి అక్టోబర్ 2 నుంచి నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే రూ.1000 నగదు జమ కానుంది.
ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా నెల నెలా రూ.1000 నిరుద్యోగ భృతి ఇవ్వడం కాదు. భృతితో యువతకు ఆర్థికంగా చేయూతనిస్తూ, మరోవైపు శిక్షణ ద్వారా నిపుణులుగా తీర్చిదిద్ది మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించే బృహత్తర లక్ష్యంతో ఈ పథకం రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల్లోంచి వచ్చిన ఓ అద్భుతమైన పథకం యువనేస్తం. క్రీడలు, యువజన సర్వీసుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర తన శాఖ ద్వారా ప్రవేశపెడుతున్న పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలనే పట్టుదలతో కృషి చేశారు. మరోవైపు ఐటీ, పంచాయతీరాజ్‌శాఖా మంత్రి నారా లోకేష్..ఈ పథకం ప్రభుత్వానికి ఎంతో పేరుప్రతిష్ఠలు తీసుకురావాలని, ఏపీ యువత భవితకు భరోసా ఇచ్చే పథకానికి ఏ ఒక్క అడ్డంకీ ఎదురుకాకూడదని రెండు నెలల్లో 36 సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
ఆదర్శం ఈ 9731 మంది... భృతితో చేయూత, మరోవైపు ఉద్యోగార్థులుగా తీర్చదిద్దేలా శిక్షణ ఇచ్చే యువనేస్తం పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండు వారాలు పూర్తి కాక ముందే 3 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయి. 1 లక్షకు పైగా అర్హులుగా గుర్తించారు. అర్హులైన వారిలో 9731 మంది తాము స్వచ్ఛందంగా భృతిని వదులుకొని .. నిరుపేద నిరుద్యోగులకు దీనిని అందివ్వాలని కోరుకున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్‌లో లాగిన్ ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలపై ఇప్పటివరకూ 48,817 ఫిర్యాదులు రాగా 7324 ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించారు.ఇప్పటి వరకూ ఒక సంక్షేమ కార్యక్రమం కోసం దరఖాస్తు దగ్గర నుండి భృతి చెల్లింపు వరకూ ఎవరి ప్రమేయం లేకుండా పూర్తిగా పారదర్శకంగా ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించడంలో లోకేష్ కీలకపాత్ర పోషించారు.