సందర్భం దొరికితే, ఏపిలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి, ఏపికి మేము లక్షల లక్షల కోట్లు ఇస్తుంటే, చంద్రబాబు తినేస్తున్నాడు అంటూ, ఆరోపణలు చేసే రాష్ట్ర బీజేపీ నేతలకు, నిన్న విడుదల అయిన, నీతి ఆయోగ్ రిపోర్ట్ చూసి, వాళ్ళ నోట్లో పచ్చి వెలక్కాయి పడినంత పని అయ్యింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రగతిని ప్రతిబింబించే స్థిర అభివృద్ధి లక్ష్యాల(సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) ఆధార నివేదిక-2018ని నీతి ఆయోగ్ శుక్రవారం విడుదల చేసింది. 2030 నాటికి సాధించాలనుకున్న స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశంలోని రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇది సూచిస్తోంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలుశాఖ, గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్‌స్టిట్యూట్, ఐక్యరాజ్యసమితి భారతీయ విభాగాలు కలిసి రూపొందించిన నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. దేశంలో ఈ స్థిర అభివృద్ధి లక్ష్యాల అమలు పర్యవేక్షణ బాధ్యతలను నీతి ఆయోగ్ నిర్వర్తిస్తోంది.
ఈ కార్యక్రమంలో 0-49 నడుమ మార్కులు సాధించిన రాష్ట్రాలను ఆకాంక్షిత రాష్ట్రాలుగా, 50-64 మధ్య మార్కులు పొందిన వాటిని ప్రతిభావంత రాష్ట్రాలుగా, 65-99 మార్కులు సాధించిన వాటిని పురోగాములు(ఫ్రంట్‌రన్నర్)గా, 100 మార్కులు చేరుకున్న వాటిని లక్ష్యసాధకులుగా పేర్కొన్నారు. ఇందులో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ 64, తెలంగాణ 61 మార్కులతో ప్రతిభావంత రాష్ట్రాల జాబితాలో నిలిచాయి. హిమాచల్, కేరళ, తమిళనాడు, చండీగఢ్, పుదుచ్చేరిలు పురోగాములుగా సత్తాచాటుకున్నాయి. ఏపీలో మొత్తం 8 లక్ష్యాల్లో పురోగామిగా, రెండు లక్ష్యాల్లో పర్‌ఫార్మర్‌గా, మూడు విభాగాల్లో వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో నిలిచింది. అభివృద్ధిని, లక్ష్యాలను పర్యవేక్షించడానికి ఆంధ్ర ప్రదేశ్ చేసిన ప్రయత్నాలను నీతీ ఆయోగ్ ప్రసంశించింది.
రియల్ టైమ్ అవుట్‌కమ్ బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్‌ను(ఆర్టీజీ) రాష్ట్రం అమలు చేస్తున్నదని తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది. ‘‘సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్- విజన్ 2029’’ పేరిట లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. పనిచేస్తున్న తీరు బాగుందని కొనియాడింది. సామర్థ్య పెంపు వనరులను సమకూర్చుకొన్న తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నదని పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదకారిగా ఉన్నదని నీతీ ఆయోగ్ అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ అధికారులు అన్ని గ్రామాలకు వెళ్లి, ప్రభుత్వ లక్ష్యాలపై ప్రజలతో 30 నిమిషాలు చర్చిస్తున్నారని వెల్లడించింది. 2017 నవంబరులో రాష్ట్ర శాసన సభలో కూడా దీనిపై చర్చించారని కూడా వివరించింది. లక్ష్యాల సాధనకు అవసరమైన సామర్థ్యాల పెంపునకు ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు చర్యలు చేపట్టాయని తెలిపింది.