దేశంలోని 101 జిల్లాల ర్యాంకింగ్ తీస్తే, ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం నెంబర్ వన్, కడపకి నాలుగవ స్థానం... విశాఖకు 13 స్థానం... ఇది చెప్పింది చంద్రబాబు కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోని పత్రికలు కావు... నీతి ఆయోగ్ ... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయానా చైర్మన్‌గా ఉన్న నీతి ఆయోగ్, ఈ విషయం చెప్పింది. అనేక వనరులు ఉండి, అభివృద్ధికి దూరంగా ఉన్న జిల్లాలను బహుముఖంగా అభివృద్ధి దిశగా పరుగుతీయించటమే లక్ష్యంగా నీతి ఆయోగ్ సరికొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 28 రాష్ట్రాల నుంచి మొదటిగా 115 జిల్లాలను గుర్తించింది. వాటినుంచి 101 జిల్లాలను ఎంపిక చేసి వాటికి బేస్‌లైన్ ర్యాంకులను కేటాయించింది.
ఐదు రంగాలలో, 49 సూచికల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించింది. వీటిలో విజయనగరం 48.15శాతం మార్కులతో మొదటి స్థానలో నిలిచింది. 47.55 శాతం మార్కులతో కడప నాల్గవ స్థానంలోనూ, 42.66శాతం మార్కులతో విశాఖ 13 స్థానంలోనూ నిలిచాయి. ఎంపిక చేసిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని నీతి ఆయోగ్ తన నివేదికలో తెలిపింది. నీతి ఆయోగ్ తన సర్వే కోసం బిల్,మిలిండా గేట్స్ ఫౌండేషన్, టాటా ట్రస్ట్, ఐటీసీ గ్రూప్, పిరమల్ ట్రస్ట్ తదితర సంస్థల సేవలను వినియోగించుకుంది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు 43 జిల్లాలను, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఉన్న 33 జిల్లాల ప్రగతిని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ విధమైన విభజన వల్ల ఏపీలోని విజయనగరం, కడప జిల్లాలు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలోకి వెళ్లాయి. నక్సల్స్ ప్రభావిత జిల్లాలైన విశాఖపట్నం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటాయి. దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన జిల్లాను అందుకునేలా పోటీపడటం, తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని పేర్కొంది. ఈ జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రారంభమైన తర్వాత రియల్‌టైమ్ ప్రాతిపదికన ఆ సూచీల ప్రగతిని పరిశీలిస్తామని, రాష్ట్రంలో అత్యుత్తమ, దేశంలో అత్యుత్తమ స్థాయికి చేరుకోవడానికి ఇంకా ఎంత దూరంలో ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తామని పేర్కొన్నారు.