పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సాంకేతిక సలహాదారు సంజయ్ కొలాహపుల్కర్ పోజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు... ఒక పక్క రాష్ట్ర బీజేపీ నాయకులు రెచ్చిపోతుంటే ఈయన మాత్రం వారిని నిరుత్సాహపరిచే రిపోర్ట్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల జరుగుతోన్న తీరు పై సంజయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు పోలవరం డ్యామ్ సైట్లో పర్యటించిన ఆయన పోలవరం పనులను, డిజైన్లను పరిశీ లించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక స్టార్ హోటల్లో ఆదివారం పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, జల వనరుల శాఖ ఇంజనీర్లు, తదితరులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రణాళికకు అనుగుణంగానే పనులు జరిగి 2019 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తున్న కాఫర్ డ్యాం పై కూడా పోజిటివ్ గా స్పందించారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులో ప్రధాన డ్యాంకు ఎగువన విడిగా కాఫర్ డ్యాం నిర్మించడం అవసరమని అభిప్రాయపడ్డారు. దీన్ని ప్రధాన డ్యాంలో అంతర్భాగంగా నిర్మిస్తామని కొంత మంది కేంద్రం నుంచి వచ్చిన వారు చెప్పటం సరికాదని వ్యాఖ్యానించారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులో ఖర్చు కోసం చూసుకోకూడదని, ప్రధాన డ్యాంకు ఎగువన విడిగా కాఫర్ డ్యాం నిర్మించకుండా ప్రధాన డ్యాం నిర్మాణం చేపడతామనడం సరికాదని అన్నారు. ఈ అంశంపై కమిటీ నిర్ణయం రావాల్సి ఉందని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెప్పగా... కమిటీ నిర్ణయం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. ఇది త్వరగా ఖరారయ్యేలా చూడాలన్నారు.
జాతీయ జలవిద్యుత్తు పరిశోధన సంస్థ చిన్న చిన్న ప్రాజెక్టులే చేపడుతుందని, గోదావరి వంటి మహానదిలో ఎగువ కాఫర్ డ్యాం లేకుండా ప్రధాన డ్యాం నిర్మించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై దృష్టి సారించాలని పోలవరం అథారిటీ అధికారులకు సూచించారు. జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం కమిటీతో సంప్రదింపులు జరిపి ఎగువ కాఫర్ డ్యాంపై త్వరగా నిర్ణయం వచ్చేలా చూడాలని సూచించారు. మరి ఈయన రిపోర్ట్ పై, కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి..