పారదర్శకంగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తామని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి శ్రీ నితిన్ గట్కారి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ తీరును మంగళవారం సాయంత్రం ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం గట్కారీ పోలవరం డ్యామ్ వద్ద విలేఖరులతో మాట్లాడుతూ అవినీతిలేని విధంగా పోలవరం ప్రాజెక్టును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి మంచి ఫలితాలు లభించేలా తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.

2018 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీక్ష చూస్తుంటే ఈ ప్రాజెక్టు పట్ల శ్రీ చంద్రబాబు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని గట్కారి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులు శరవేగంతో సాగుతున్న తీరు ఎంతో సంతృప్తి నిచ్చిందని ప్రాజెక్టు పూర్తి చేయడం ఎంతో కష్టతరమని చంద్రబాబు పడుతున్న కష్టానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని గట్కారీ చెప్పారు. పరిపాలనాపరంగా ఎటువంటి అనుమతులు కోసం ప్రతిపాదనలు వంపితే యుద్ధ ప్రాతిపదికన ఆమోదిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా అమలు చేస్తామని ఈ విషయంలో ఎక్కడా కూడా జాప్యం లేకుండా తనవంతు పూర్తి సహకారం అందిస్తానని గట్కారీ చెప్పారు. పోలవరం కాంక్రీట్ పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న తీరుపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేసారు.

రాష్ట్ర గవర్నరు నరసింహన్ మాట్లాడుతూ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నదే ప్రజల ఆకాంక్ష అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత కాలవ్యవధిలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతాంగానికి అవసరమైన సేద్యపు నీరు, పల్లెలకు త్రాగునీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నరసింహన్ కోరారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నేడు శుభదినమని తొలిసారిగా కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గట్కారీ పోలవరం ప్రాజెక్టు పనులు చూడడానికి స్వయంగా రావడం ఆనందంగా ఉన్నదని చెప్పారు. 2019 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఇవ్వడానికి అన్ని విధాల పూర్తి సహకారం అందించాలని చంద్రబాబు గట్కారీని కోరారు.

పోలవరం ప్రాజెక్టు కుడి కాల్వ పనులు 97 శాతం పూర్తయితే, ఎడమ కాల్వ పనులు 57 శాతం పూర్తి అయ్యాయని అదే విధంగా హెడ్వర్క్ పనులు 37 శాతం, స్పిల్ ఛానల్ పనులు 76 శాతం, స్పిల్ కాంక్రీట్ పనులు 9 శాతం, డయాప్రమ్ వాల్ 30 శాతం, రేడియల్ గేట్స్ 50 శాతం పూర్తి అయ్యాయని, ఈ స్పూర్తితో మిగిలిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా 20 సార్లు పరిశీలన చేసానని, 40 సార్లు అధికారులతో సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేయాలనే ధృఢ సంకల్పంతో నిరంతరం కృషి చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read