పోలీస్ వాహనంలో అడిగిన వెంటనే డీజిల్ అప్పుపై పోయలేదని పెట్రోలు బంకులో పనిచేసే కార్మికుణ్ని గుంటూరు జిల్లా నిజాంపట్నం ఎస్సై ఎం.రాంబాబు చితకబాదారు. బాధితుని కథనం ప్రకారం..శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఎస్సై రాంబాబు తన వాహనాన్ని డ్రైవరుకిచ్చి డీజిల్ పోయించుకు రమ్మని స్థానిక ఓంనమశివాయ పెట్రోలు బంకుకు పంపారు. డ్రైవరు వచ్చి డీజిల్ పోయమని అడగ్గా.. తన యజమాని చెబితేనే పోస్తానని కార్మికుడు హుమాయూన్ చెప్పాడు. అదే విషయాన్ని డ్రైవరు ఎస్సైకు ఫోన్ లో వివరించాడు. ఆగ్రహించిన ఎస్సై వాహనాన్ని వెనక్కి పిలిపించి అదే వాహనంలో బంకుకు వచ్చి కార్మికుడిని కొట్టారు. అనంతరం స్టేషన్‌కి తీసుకెళ్లి కూడా కొట్టారని.. అదేమని అడిగితే అసభ్య పదజాలంతో దుర్భాషలాడారని బాధితుడు వాపోయాడు.
ఈ ఘటనను నిరసిస్తూ ఎస్సైకు వ్యతిరేకంగా బంకు కార్మికులు స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీనిపై ఎస్సై రాంబాబును వివరణ కోరగా తాము నెలనెలా బిల్లు చెల్లిస్తామని, డీజిల్ కోసం వాహనం పంపితే కార్మికుడు డ్రైవరుతో దురుసుగా మాట్లాడాడని అన్నారు. వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సంఘటన విషయాన్ని యజమానుల దృష్టికి తీసుకెళ్లామని కార్మికులు తెలిపారు.