ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం గుంటూరులో పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులెవరూ హాజరుకావటం లేదు. ఏపీ పర్యటనకు వస్తున్న మోదీ ఆదివారం రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ఉదయమే ఈ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కాకుండా ఓఎన్‌జీసీ నుంచి అందింది. ఈ నేపథ్యంలో ప్రధాని పాల్గొనే కార్యక్రమాలకు హాజరుకావాలా? వద్దా? రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరినైనా పంపించాలా? అనే అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో శనివారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అయితే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ ఓ వైపు నిరసనలు తెలుపుతూ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని పంపించటం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. నల్లచొక్కాలు ధరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని పంపాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ అది కూడా వద్దనుకున్నారు. అయితే ప్రధాని మోడీకి స్వాగతం పలకటానికి, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఏపీ పర్యటనకు విచ్చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఢిల్లీ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకుగాను గవర్నర్ నరసింహన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం 10:45కు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం 11:05 గంటలకు హెలికాఫ్టర్‌లో గుంటూరుకు బయల్దేరనున్నారు. 11:15 గంటలకు ఏటుకూరు బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఏటుకూరులో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే కృష్ణపట్నంలో నిర్మించే బీపీసీఎల్ కోస్టల్ టెర్మినల్‌కు మోదీ భూమిపూజ చేయనున్నారు. ఆ తర్వాత 11:30 గంటలకు గుంటూరు సభలో మోదీ ప్రసంగించనున్నారు. మ.12:25 గంటలకు గుంటూరు హెలిప్యాడ్‌కు చేరుకున్న అనంతరం 2:50 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.