పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాజెక్ట్ లో జరిగే ప్రతి పనిలోనూ, కేంద్రం ఇబ్బంది పెడుతూనే ఉంది. అన్నీ దాటుకుని, ఆ పని పూర్తి చేసే సరికి, విలువైన సమయం వృధా అయిపోతుంది. గత సంవత్సర కాలం నుంచి అదే తీరు. కీలకమైన పనుల విషయంలో కేంద్రం ఆమోదం తప్పనిసరి. ప్రస్తుత రాజకీయ పరిస్థితి అవకాసంగా తీసుకుని, రాష్ట్రానికి చుక్కలు చూపిస్తుంది కేంద్రం. నితిన్ గడ్కరీ వచ్చి, వారం రోజుల్లో అన్ని సమస్యలు, నేనే స్వయంగా తీరుస్తాను అని చెప్పినా, ఏమి లాభం లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి కాని, ఆచరణలో మాత్రం అంతా శూన్యం. ప్రతి విషయంలో, లోతుగా వెళ్లి, ఏ చిన్న తేడా ఉన్నా, అది పట్టుకుని, మొత్తం ప్రక్రియే ఆపేస్తున్నారు.
భూసేకరణ, పునరావాసం సహా తుది అంచనాలు, డిజైన్లను ఆమోదించకుండా అడుగడుగునా కొర్రీలు వేస్తూ అడిగిన సమాచారమే అడుగుతోంది. రాష్ట్ర జలవనరుల శాఖ అన్నింటికి సమాధానాలు చెబుతున్నా కీలక డిజైన్ల ఆమోదానికి గానీ, తుది అంచనాల ఆమోదానికి గానీ ఒక్క అడుగైనా ముందుకు వేయడంలేదు. గత నెల రోజులుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ప్రతి 2, 3 రోజులకొకసారి ఢిల్లీకి వెళ్లి వస్తునే ఉన్నారు. జలసంఘం అధికారులతో చర్చలు సాగిస్తూనే ఉన్నారు. అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అయినా జలసంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సీడబ్ల్యూసీకి అందుబాటులో ఉండేందుకు 14 మంది ఇంజనీరింగ్ అధికారులు ఢిల్లీలోనే ఉన్నారు.
వారు నిత్యం ఉదయం 10 గంటల నుంచి జలసంఘం కార్యాలయం తలుపులు మూసివేసేవరకు అక్కడే ఉంటూ అడిగిన వివరాలు ఇస్తూ వచ్చారు. తుది అంచనాల ఆమోదంలో జాప్యం జరిగేటట్లు అయితే తక్షణమే రూ. 10వేల కోట్లు మంజూరు చేయాలని, కాపర్ డ్యామ్, స్పిల్ చానల్ ఎట్ కం రాఫెల్ డ్యామ్ పనులు వడివడిగా పనులు పూర్తి చేసేందుకు వాటి డిజైన్లు అయినా ఆమోదించాలని రాష్ట్ర అధికారులు అభ్యర్థించారు. ఈ పనుల పూర్తికి సీడబ్ల్యూసీ ఆమోదం తప్పనిసరి. ఈ అనుమతులు రాకుంటే నిర్ణీతగడువులోగా పూర్తి చేయడం కుదరదు. 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీరు అందించాలన్న లక్ష్యం నెరవేరకుండా పోతుంది. ఈ పరిస్థితిలో క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తామని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.
పోలవరం భూసేకరణ, పునరావాసానికి సవరించిన అంచనాలను పరిశీలిస్తున్నది ఒక చీఫ్ ఇంజినీరు స్థాయి అధికారి కావడంతో రెవెన్యూ అంశాలను ఆయనకు అర్థమయ్యేలా ఐఏఎస్‌లు విడమర్చి చెప్పారు. భూసేకరణ ఎలా చేస్తారు? డ్రాఫ్టు నోటిఫికేషన్ అంటే ఏమిటి? డ్రాఫ్టు డిక్లరేషన్ అంటే ఏమిటి? 2013 భూసేకరణ చట్టం ఏం చెబుతోంది? అంతకు ముందు చట్టం ఏం చెప్పింది? వంటి వాటితోపాటు మొత్తం ప్రక్రియను ఎలా నిర్వహిస్తారో వారు ఆ చీఫ్ ఇంజినీరుకు కూలంకషంగా అర్థమయ్యేలా వివరించాల్సి వచ్చింది. ప్రతి అంశానికి సంబంధించి ఒక్కో నమూనా ఫైలు కావాలని ఆయన అడగ్గా అన్నీ సమర్పించారు. పోలవరం ప్రాజెక్టువల్ల ప్రతి గ్రామంలో ముంపులో చిక్కుకునే భూమిని మ్యాప్‌లో చూపిస్తూ సర్వే నెంబర్ల వారీగా మ్యాప్‌లను చీఫ్ ఇంజినీరు అడిగారు. వాటిని రంగుల్లో గుర్తించి దాదాపు 371 ఆవాసాలకు సంబంధించిన మ్యాప్‌లను సమర్పించారు. ఇలా వివరణల మీద వివరణలు, ఇచ్చుకుంటే పొతే, ఎన్నికల సమయం వచ్చేస్తుంది, మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా, ఇవన్నీ పక్కన పడేసినట్టే..