రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ లా డౌన్లో సైతం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు, మహిళలు, స్థానికులు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, వారి ఇళ్ళల్లోనే దీక్షలు చేస్తున్నారు. అయితే రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు, నిరసనలను ప్రభుత్వం, పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం రైతులు, మహిళలకు నోటీసులు జారీ చేశారు. మూడు రాజధానుల ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు రైతులు, మహిళలు, స్థానికులు ప్రభుత్వంపై నిరసన గళం ఎత్తుతున్నారు. లాక్ డౌన్లో సైతం సామాజిక దూరం పాటిస్తూ ఎవరి ఇళ్ళ వద్ద వారే నిరసన చేస్తున్నారు. ఇటీవల వరకు ప్రైవేటు స్థలాల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ రైతులు, మహిళలు నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని లాక్ డౌన్లో ఇలాంటి చర్యలకు దిగితే కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇప్పటి వరకు, నాలుగు నెలలు దాటుతున్నా, ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు అటు వైపు వెళ్తున్నా వారి వైపు కూడా చూడలేదు. ప్రతి రోజు ఏదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసు అధికారులు లాక్ డౌన్ నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తారంటూ రైతులు, మహిళలకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు వెంకటపాలెంలోని యూనియన్ బ్యాంకు వద్ద అమరావతి జిందాబాద్ అంటూ చేసిన నినాదాలపై పోలీసు శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నోటీసులు ఇచ్చింది. మరోవైపు 12 నుంచి 15 మంది అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నారని లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి యధేచ్చగా బయటకు తిరుగుతున్నారని పోలీసు శాఖ ఆక్షేపించింది.

గుంటూరు జిల్లాలో సెక్షన్ 144తో పాటు పోలీసు యాక్ట్ అమలులో ఉందని మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు కూడా ఉన్నాయని ఈ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తారంటూ రైతులు, స్థానికులు, మహిళలకు పోలీసు శాఖ నోటీసులు జారీ చేసింది. చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. దీంతో మరోసారి అమరావతి ప్రాంతంలో అలజడి నెలకొంది. రైతులకు, మహిళలకు పోలీసు శాఖ నోటీసులు జారీచేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే రైతులు మాత్రం, ఈ నోటీసుల పై మండి పడుతున్నారు. తాము ఎక్కడా గుమికుడటం లేదని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తమ ఆందోళన ప్రభుత్వానికి చెప్తున్నామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read