జగన్ మోహన్ రెడ్డి పరువుకి భంగం కలిగించే విధంగా మాట్లాడారని చెప్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు పంపించింది. చంద్రబాబు నాయుడుడి పాటుగా, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ సిహెచ్ రామోజీ రావు, ఉషోదయ పబ్లికేషన్స్ ఎడిటర్ ఎం. నాగేశ్వరరావుకు కూడా లీగల్ నోటీసులు వెళ్ళాయి. అలాగే ఆంధ్రజ్యోతికి కూడా లీగల్ నోటీసులు వెళ్లినట్టు తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేసారని, అవి ఆయన పరువుకు భంగం అని, అలాగే చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించాయని, అందుకే వారికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కమిషనర్ మరియు ఎక్స్-అఫిషియో సెక్రటరీ (వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరాలు) తరుపున కే.శశిధర్ ఈ నోటీసులు ఇచ్చారు. హైకోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఇసుకకు సంబధించి చంద్రబాబు జగన్ పై ఆరోపణలు చేసారని అన్నారు.
అలాగే పిడిఎస్ కింద ఇచ్చే సరుకులను పంపిణీ చేయడానికి ఉపయోగించే సంచులను సరఫరా చేసే ఒప్పందాన్ని జగన్ కు చెందిన సంస్థకు ఇచ్చినట్టు ప్రచారం చేసారని, అందుకే నోటీసులు ఇస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక అలాగే, మరొక నోటీసు కూడా జారీ చేసారు. గుంటూరు జిల్లాలోని దాచెపల్లి మండలంలో ఉన్న సరస్వతి పవర్ మైనింగ్ లీజులను 50 సంవత్సరాలకు, రూల్స్ అన్నీ బ్రేక్ చేసి ఇచ్చినట్టు, ఈనాడు, ఆంధ్రజ్యోతి రాశాయని, ప్రభుత్వం ప్రత్యేక లీగల్ నోటీసు అందుకున్న, చంద్రబాబు నాయుడు, రామోజీ రావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇదే విషయాన్ని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది కూడా ఈ రోజు ధృవీకరిస్తూ, ఆమోద పబ్లికేషన్స్, ఉషోదయా పబ్లికేషన్స్‌కు, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామని, వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.