ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను ఇటీవల తితలీ తుపాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఇంకా తుపాను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంది. అయితే నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా చంద్రబాబు పిలుపిచ్చారు. మన రాష్ట్రంలో జరిగిన విపత్తుకు, అందరూ తగిన విధంగా సహయం చెయ్యాలని కోరారు. చంద్రబాబు పిలుపుకు స్పందించిన సినీ హీరోలు ముందుకొస్తున్నారు. అందరి కంటే ముందు, తెలుగు చిత్ర పరిశ్రమ నుండి మొదటి వ్యక్తిగా సంపూర్ణేష్ బాబు నిలబడ్డాడు.
తన వంతు సాయంగా 50 వేల రూపాయలు సిక్కోలు ప్రాంత వాసులకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రిలీఫ్ ఫండ్ కి అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. శ్రీకాకుళం వాసులు తుపాను కారణంగా చాలా నష్టపోయారని స్నేహితుల ద్వారా తెలుసుకున్నట్లు చెబుతూ.. తనవంతు ఆర్థిక సహాయాన్ని ప్రకటించానని అన్నాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా 5 లక్షల సహాయం చేసారు. అదే విధంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు మంచి మనసుతో ముందుకు రావాలని సంపూర్ణేష్ బాబు పిలుపునిచ్చారు.
ఇక ఈ రోజు చంద్రబాబు పిలుపికి స్పందిస్తూ, ‘తితలీ’ బాధితులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ విరాళం ప్రకటించి ఇండస్ట్రీలోని వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రూ.15 లక్షల విరాళాన్ని, కల్యాణ్‌రామ్ రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు. గత కొద్దిరోజులుగా.. ‘తితలీ’ తుఫానుతో శ్రీకాకుళం జిల్లాలోని 169 గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఈ తుఫాను పెను బీభత్సానికి చెట్లు, పూరిగుడిసెలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల కుటుంబాలు నివాసముండేందుకు ఇళ్లు లేక నిరాశ్రయులైనట్లుగా తెలుస్తోంది.