రాష్ట్రంలో పి.ఎం.ఎ.వై, ఎన్.టి.ఆర్. నగర పథకం కింద అత్యాధునిక షీర్ వాల్ టెక్నాలజీతో పట్టణ పేదలకు గృహాలు నిర్మిస్తున్నారు.... ఈ షీర్ వాల్ టెక్నాలజీ పెద్ద బిల్డర్ లు కూడా ఇప్పుడు వాడటం లేదు... అలాంటిది పేదల కోసం, ప్రభుత్వం ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇళ్ళు కడుతుంది. రాష్ట్రంలోని 110 మునిసిపాలిటీల్లో గృహ నిర్మాణాల కోసం తొమ్మిది లక్షలు దరఖాస్తులు వస్తే, వీటిలో 6.41 లక్షలు గృహాలు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న పట్టణ గృహ నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైంది. రాష్ట్రంలో పట్టణ పేదల ఆవాసాలను బట్టి 300, 365, 430, చదరపు అడుగుల విస్తీర్ణాల్లో మూడు విభాగాలుగా ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.
షీర్ వాల్ టెక్నాలజీ.. సంప్రదాయ నిర్మాణ పద్ధ్దతులకు ఇది పూర్తి భిన్నం. నాణ్యతతో పాటు అతి తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఇది ఉపకరిస్తుంది. షీర్ వాల్ టెక్నాలజీలో ఇటుకలు వాడాల్సిన అవసరం లేదు. గోడలు, శ్లాబ్ అంతా రోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్(ఆర్‌సీసీ)తోనే వేస్తారు. గోడలు, శ్లాబ్‌ల విస్తీర్ణం, డిజైన్‌ను బట్టి ముందు అల్యూమినియం ప్యానెళ్లు ఏర్పాటు చేస్తారు. ఆ ప్యానెళ్లలోనే విద్యుత, ఇతర పైపులు అమర్చుతారు. అనంతరం ఆర్‌సీసీ వేస్తారు.
మూడు రోజుల తరువాత ప్యానెళ్లు తొలగించి గట్టిపడిన గోడలకు ప్లాస్టింగ్ పనులూ చేసుకోవచ్చు. దీంతో సాధారణ నిర్మాణ విధానంతో పోలిస్తే అతి తక్కువ సమయంలో పనులు పూర్తవుతాయి. లబ్ధిదారులకు ఎక్కడ, ఏ ఇళ్లు కేటాయిస్తున్నారో ముందే వెల్లడిస్తున్నారు... దీంతో, వారు కూడా తమ ఇళ్ల నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. పేదలకు ధీమా, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహాయం చేస్తుంది. ఎల్అండ్టీ, ఎన్సీసీ, షాపూర్జీ పల్లోంజి, కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తదితర ప్రఖ్యాత సంస్థలకు ఇళ్ల నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.