గుంటూరులో నాలుగు ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేస్‌బుక్ ఖాతాలే వారిని పట్టించాయి. ఓ పార్టీకి చెందిన యువకులుగా పోలీసులు వీరిని అనుమానిస్తున్నారు. ఈ నెల 4న తెల్లవారుజామున గుంటూరులోని స్తంభాలగరువు, నల్లచెరువు, అరండల్‌పేట, నెహ్రూనగర్ ప్రాంతాల్లోని నాలుగు విగ్రహాలకు నిప్పు పెట్టడం, పగలగొట్టడం వంటి ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయారావు ముగ్గురు సీఐలతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి కేసు విచారణను కొలిక్కి తీసుకొచ్చారు. యువకులు వారి ముఖాలు కనిపించకుండా విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు.
ఘటన జరగటానికి ముందు నగరంలో ఓ ప్రాంతంలో ఆందోళన జరిగింది. ఇక్కడ పాల్గొన్నవారు ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ సాగించిన పోలీసులకు క్లూ దొరికింది. ఆందోళనలో పాల్గొన్న వారి ఫొటోలు సేకరించారు. వారు తమ ఫొటోలను ఆ రోజు ఫేస్‌బుక్ ఖాతాల్లో అప్‌లోడ్ చేశారు. విగ్రహాల వద్ద సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫొటోలతో వాటిని ధ్రువీకరించుకుని పోలీసులు ఈ కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. యువకులను అదుపులోకి తీసుకుని ఆధారాలతో ప్రశ్నించడంతో తప్పు ఒప్పుకున్నారని తెలిసింది. మరో నలుగురు తమకు సంబంధం లేదని బుకాయించినట్లు సమాచారం. ఈ యువకులను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు.
విగ్రహాలను పగలగొట్టే ప్రాంతాలకు ముందుగా ఎర్రచొక్కా ధరించిన ఓ యువకుడు బైకు మీద చేరుకుని అక్కడ పరిస్థితులను గమనించి మిత్రులకు చెప్పడంతో పథకం ప్రకారం నాలుగు బృందాలుగా నాలుగు ప్రాంతాలకు చేరుకుని ధ్వంసం చేసినట్లు సమాచారం. పక్కా ఆధారాలతో పాత్రదారులను గుర్తించారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏటి అగ్రహారానికి చెందిన సైదా, నల్లచెరువుకు చెందిన నాని, గోరంట్లకు చెందిన కిరణ్, శివ ప్రసాద్ తదితరులు విగ్రహాల ధ్వంసంలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. వీరికి వైఎస్ఆర్ పార్టీకి ఏమి సంబంధం, వీరి పాత్ర ఏంటి, ఎవరు చేపించారు అనే విషయం పై ఆరా తీస్తున్నారు.